తండ్రి మరణాన్ని తట్టుకోలేక బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాద ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని ఏలూరు జిల్లా చాట్రాయి ప్రాంతానికి చెందిన చెన్నకేశవులు కుమార్తె జ్ఞానశ్రీ (21) మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. మైసమ్మగూడలోని ఉమెన్స్ హాస్టల్లో ఉంటోంది. కాగా మార్చి 31వ తేదీన చెన్నకేశులు అనారోగ్యంతో మృతిచెందాడు అప్పుడు సొంతూరుకు వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొంది. అన్ని కార్యక్రమాలు ముగిసిన తర్వాత రెండు రోజుల క్రితం కాలేజీకి వచ్చింది. బుధవారం కాలేజీలో పరీక్ష రాసిన జ్ఞానశ్రీ గురువారం పరీక్షకు హాజరుకాకుండా హాస్టల్లోనే ఉండిపోయింది.
మధ్యాహ్నం 3 గంటల సమయంలో హాస్టల్ గదిలో ఉరివేసుకుంది. ఇది గమనించిన స్నేహితురాళ్లు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించిన పోలీసులు.. జ్ఞానశ్రీ చేతిలో సూసైడ్ నూట్ గమనించారు. అందులో “మమ్మీ.. డాడీ లేని జీవితం ఊహించుకోలేకపోతున్నా. తమ్ముడు, నువ్వు తాత వద్ద ఉంచండి. నేను డాడీ వద్దకు వెళ్తున్నా” అని అందులో రాసి ఉంది. కాగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.