AP News | సులువుగా డబ్బులు సంపాదించవచ్చని ఆశజూపి యువతులతో నగ్నంగా పూజలు చేయించిన ఉదంతం ఏపీలోని గుంటూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. వ్యాపారంలో నష్టపోయిన మహిళకు మాయమాటలు చెప్పిన ఓ పూజారి.. ఆమె ద్వారా ముగ్గురు యువతులతో నగ్నంగా పూజలు చేయించడమే కాకుండా వారిని లైంగికంగా వేధించాడు. దీంతో వాళ్ల చెర నుంచి తప్పించుకున్న యువతులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఉదంతం బయటపడింది. దీనికి సంబంధించిన వివరాలను గుంటూరు జిల్లా డీఎస్పీ మహబూబ్ బాషా ఆదివారం బయటపెట్టారు.
గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లుకు చెందిన నాగేశ్వరరావు పూజలు చేస్తుంటాడు. అతనికి సోషల్మీడియాలో చిలకలూరిపేటకు చెందిన అరవింద అనే మహిళ పరిచయమైంది. అప్పటికే ఆమె పలు వ్యాపారాలు చేసి నష్టపోవడంతో తన పరిస్థితిని పూజారి నాగేశ్వరరావుకు వివరించింది. అప్పుడు క్షుద్ర పూజలు చేస్తే గుప్త నిధులు సంపాదించవచ్చని సలహా ఇచ్చాడు. అయితే ఈ పూజలో అమ్మాయిలను నగ్నంగా కూర్చోబెట్టాల్సి ఉంటుందని చెప్పాడు. సులభంగా డబ్బులు సంపాదించవచ్చనే ఆశతో పూజారి నాగేశ్వరరావు సలహాకు అరవింద ఒప్పుకుంది. అనంతరం నాగేశ్వరరావు సహచరుడైన నాగేంద్రబాబు సహాయంతో కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన మధ్యవర్తుల ద్వారా ఇద్దరు యువతులను ఆశ్రయించారు. నగ్నంగా పూజలో కూర్చుంటే ఒక్కొక్కరికి 50 వేల చొప్పున ఇస్తామని డబ్బు ఆశచూపారు. డబ్బుకు ఆశపడ్డ ఆ యువతులు కూడా పూజకు ఒప్పుకున్నారు.
ఇద్దరు అమ్మాయిలతో పొన్నెకల్లు, చిలకలూరిపేటలోని వాళ్ల ఇండ్లలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో పూజలు నిర్వహించారు. పూజల తర్వాత డబ్బులు ఇవ్వకపోగా ఇద్దరు యువతులతో నాగేశ్వరరావు, అతని అనుచరులు అశ్లీలంగా ప్రవర్తించారు. వారిని లైంగిక వేధించారు. యువతులు ఎదురుతిరగడంతో వాళ్లను నిర్బంధించారు. శనివారం నాడు డబ్బులు ఇస్తామని పొన్నెకల్లుకు తీసుకెళ్తుండగా గోరంట్ల సమీపంలో యువతులు తప్పించుకుని దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నల్లపాడు పోలీసులు వెంటనే ఘటనాస్థలికి వెళ్లి యువతులను రక్షించారు. ఆదివారం నాడు నాగేశ్వరరావు, అరవింద, నాగేంద్రబాబు, రాధా, సునీల్ సహా సుమారు 12 మందిని అరెస్టు చేశారు. రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.