హైదరాబాద్, జూలై 17(నమస్తే తెలంగాణ): గోదావరిలో మిగులు జలాలు లేవని నిపుణులు చెప్తున్నారని బీజేపీ ఎంపీ డీకే అరుణ తెలిపారు. గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయా? ఉంటే ఎన్ని ఉన్నాయి? వాటిని ఏపీ తీసుకెళ్లే అవకాశం ఉన్నదా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉన్నదని అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో సీఎంల భేటీపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పారు. ఇరు రాష్ర్టాల సీఎంల భేటీని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. బనకచర్లపై సమగ్రమైన చర్చ జరగాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.
బనకచర్లతో తెలంగాణకు అన్యాయం జరగనిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే దీనిపై బీజేపీ స్పష్టతనిచ్చిందని తెలిపారు. ఇక టెలిమీటర్లు కొత్తవేం కాదని, దీనిపై గతంలోనే చర్చ జరిగినట్టు తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉన్నదని అరుణ చెప్పారు.