Yamini Sharma | ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై బీజీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ విమర్శలు గుప్పించారు. దళితవాడల్లో 5వేల గుడులను టీటీడీ తరఫున కట్టిస్తామని తిరుపతిలో సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనను వైఎస్ షర్మిల అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షర్మిల వ్యాఖ్యలను యామిని శర్మ ఖండించారు. ప్రజలు చెల్లించే పన్నులతో నడిచే ప్రభుత్వానికి, హిందువులు హుండీలో వేసే ముడుపులతో సేవ చేసే ధార్మిక సంస్థలకు తేడా తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.
టీటీడీ ద్వారా మరో 5 వేల ఆలయాలను నిర్మిస్తామని సీఎం చెప్పగానే షర్మిల సమాజసేవ, అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారని యామిని శర్మ మండిపడ్డారు. భక్తులు ఇచ్చిన నిధులను టీటీడీ ధూపదీప నైవేద్యాల కోసం, ధార్మిక వ్యాప్తి కోసం ఖర్చు పెడుతోందని తెలిపారు. హిందూ ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వ సొమ్ములు తీసుకోవడం లేదని స్పష్టం చేశారు ప్రభుత్వమే దేవాదాయ శాఖ ద్వారా ఆలయాల నుంచి పన్నులు వసూలు చేస్తోందని అన్నారు. అదికాకుండా టీటీడీ ఇప్పటికే ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలు చేస్తోందని ఆమె గుర్తుచేశారు.
ప్రజలపై అంత ప్రేమ ఉంటే మీ ఆస్తులు మొత్తం సమాజానికి ఇవ్వాలని షర్మిలకు యామినీ సూచించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గురించి మాట్లాడే హక్కు ఆమెకు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా దళితులను ఓటు బ్యాంకుగానే చూసిందని విమర్శించారు.