YS Jagan | ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. డిక్లరేషన్ అంశంపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు. తిరుమల పర్యటన రద్దు చేసుకోవడానికి గల కారణాలను కాసేపట్లో జగన్ మీడియా ముందకొచ్చి చెబుతారని సమాచారం.
శ్రీవారి లడ్డూ వివాదం నేపథ్యంలో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని వైఎస్ జగన్ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. వైసీపీ ఈ ప్రకటన చేసినప్పటి నుంచి దీనిపై వివాదం మొదలైంది. అన్య మతస్తుడు కావడంతో వైఎస్ జగన్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే తిరుమలలో అడుగుపెట్టాలని కూటమి నేతలు, హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. వైసీపీ నేతలు మాత్రం దీన్ని వ్యతిరేకించారు. ముఖ్యమంత్రి హోదాలో ఐదేళ్లు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన వ్యక్తిని డిక్లరేషన్ ఎలా అడుగుతారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. జగన్ డిక్లరేషన్ ఇవ్వరని.. ఇందులో రాజకీయ కోణం ఉందని ఆరోపించారు. ఇలా అనవసర రాద్దాంతం జరుగుతుండటంతో తన తిరుమల పర్యటనను జగన్ వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబు ఇంట్రెస్టింగ్ ట్వీట్
జగన్ పర్యటన రద్దుకు కొద్ది నిమిషాల ముందే ఏపీ సీఎం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. అత్యంత పవిత్రంగా భావించే తిరుమల పవిత్రతను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని.. శ్రీవారి సన్నిధికి వచ్చే ప్రతి భక్తుడూ టీటీడీ నిబంధనలను పాటించాలని కోరారు. కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయం కోట్ల మంది హిందువుల అతిపెద్ద పుణ్యక్షేత్రమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ దివ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండటం మన అందరి అదృష్టమని తెలిపారు. ఏడుకొండలవాడి పవిత్రతను కాపాడేందుకు, భక్తుల మనోభావాలను పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు. తిరుమల దర్శనానికి వెళ్లే ప్రతి భక్తుడు అత్యంత నియమ నిష్ఠలతో, శ్రద్ధాసక్తులతో స్వామివారిని కొలుస్తారని చెప్పారు. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ క్షేత్ర పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ ఆలయ నియమాలను, ఆగమశాస్త్ర ఆచారాలను, టీటీడీ నిబంధనలను తప్పక పాటించాలని కోరారు. భక్తుల మనోభావాలకు, ఆలయ ఆచారాలకు భిన్నంగా ఎవరూ వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేశారు.
తిరుపతిలో జగన్‌పై దాడికి కుట్ర.. సంచలన ఆరోపణ చేసిన వైసీపీ
వైఎస్ జగన్ తిరుమల పర్యటనలో ఆటంకాల్ని సృష్టిస్తూ భక్తుల ముసుగులో వైఎస్ జగన్‌పై దాడికి బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి, జనసేన నేత కిరణ్ రాయల్ అలాగే ఇతర టీడీపీ నేతలు డబ్బులిచ్చి గూండాలను పురిగొలుపుతున్నారని సమాచారం అందిందని వైసీపీ ఆరోపించింది. వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడానికి, జగన్ కాన్వాయ్‌పై గుడ్లు వేసేందుకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో మనుషుల్ని పురమాయించినట్లు తెలుస్తోందని పేర్కొంది. వైఎస్ జగన్ తిరుమల పర్యటనతో శ్రీవారి లడ్డూ విషయంలో నీ బండారం బయటపడుతుందని భయపడుతున్నావా? అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ప్రశ్నించింది.