Bhogi Celebrations | శ్రీశైలం : భ్రమరాంబ మల్లికార్జున క్షేత్రంలో సోమవారం భోగిమంటలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధాన ఆలయ మహాద్వారం ఎదురుగా గంగాధర మండపం కార్యక్రమాన్ని జరిపారు. ఈవో శ్రీనివాసరావు దంపతులు, ప్రధాన అర్చకులు హెచ్ వీరయ్య, అర్చకులు, ఆలయ పర్యవేక్షకులు హరియనాయక్, భద్రతా విభాగం పర్యవేక్షకులు మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో అర్చకస్వాములు, వేదపండితులు లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. అనంతరం సంప్రదాయబద్ధంగా పిడకలు, ఎండుగడ్డి, వంటచెరుకుని వేసి భోగి మంటలు వేశారు. సంక్రాంతి సందర్భంగా వేసే భోగిమంటలకు మన సంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉన్నది. భోగిమంటలతో అమంగళాలు తొలగి సకలశుభాలు కలుగుతాయని పండితులు పేర్కొన్నారు. సంస్కృతి సంప్రదాయాలపై అందరికీ మరింత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఏటా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో భోగిమంటలను నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.