అమరావతి : ఏపీ స్పీకర్(AP Speaker) గా ఎన్నికైన అయ్యన్నపాత్రుడు(Ayyannapatrudu) తన ఛాంబర్లో బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఈటీవీకి అనుమతి నిరాకరిస్తూ ఇచ్చిన నిబంధనల దస్త్రాన్ని కొట్టివేస్తూ తొలి సంతకం చేశారు.
గత ప్రభుత్వ హయాంలో ఈటీవీకి అనుమతి నిరాకరిస్తూ నిబంధనలు విధించింది. ఈటీవీపై ఆంక్షలు తొలగించాలంటూ టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర(MLA Narendra) స్పీకర్‌కు లేఖ ఇచ్చారు. తక్షణమైన ఆంక్షలు సడలిస్తూ స్పీకర్ తొలిసంతకం చేశారు. ఈటీవీ సహా పలు ఛానళ్ల (TV Channels) పై ఉన్న నిబంధనలను సైతం కొట్టివేశారు.
16వ శాసనసభాపతిగా ఏకగ్రీవంగా అయ్యన్నపాత్రుడు ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి శనివారం అధికారికంగా ప్రకటించారు. అనంతరం ఆయనను సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. రెండోరోజు సమావేశంలో కొత్తగా ఎన్నికైన ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రమాణం స్వీకారం చేశారు.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అయ్యన్నపాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1983లో టీడీపీ ఆవిర్భావం అనంతరం ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఒకసారి ఎంపీగా పనిచేశారు. పదిసార్లు నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసిన ఆయన ఏడుసార్లు గెలుపొందారు. ఇప్పటివరకు ఐదు ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు.