అర్ధరాత్రి ఆటో ఎక్కిన ఓ యువతిపై ఆటో డ్రైవర్ అఘాయిత్యానికి యత్నించాడు. కానీ అతని బారినుంచి ఎలాగోలా తప్పించుకున్న యువతి పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నంద్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. నంద్యాలకు చెందిన సమరసింహ ఎంటెక్ చదివాడు. హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా కొంతకాలం పనిచేశాడు. కానీ కుటుంబ సమస్యల కారణంగా నంద్యాలకు వచ్చి ఆటో నడుపుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే విశాఖపట్నం నుంచి ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలులో ఏడాదిన్నర పాపతో కలిసి అర్ధరాత్రి దిగింది. రైల్వే స్టేషన్ బయటకు వచ్చిన ఆమె.. ఆళ్లగడ్డ వెళ్లేందుకు సమరసింహ ఆటో ఎక్కింది. యువతి ఒంటరిగా ఉండటంతో పాటు అదే సమయంలో కుండపోత వర్షం కురుస్తుండటంతో అవకాశాన్ని ఉపయోగించుకుని ఆటోను దారి మళ్లించి దీబగుంట్లకు తీసుకెళ్లాడు. అయితే వాహనాల రాకపోకలతో భయపడిన సమరసింహ ఆమెను వదిలేశాడు. దీంతో అతని నుంచి తప్పించుకున్న యువతి.. ఓ హోటల్లో తెల్లవారే వరకు తలదాచుకుని.. ఆ తర్వాత ఆళ్లగడ్డ చేరుకుని భర్తతో కలిసి నంద్యాల త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
సీసీ ఫుటేజీ, సెల్‌ఫోన్ లొకేషన్స్ ఆధారంగా సమరసింహను పోలీసులు పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.