హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీకి ప్రత్యేక ట్రిబ్యునల్ అవసరమే లేదని ఏపీ సర్కారు పేర్కొన్నది. ఈ మేరకు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ దాఖలు చేసిన స్టేట్మెంట్ ఆఫ్ కేస్ (ఎస్వోసీ)పై తాజాగా కౌంటర్ రిజాయిండర్‌ను సమర్పించింది. అంతర్రాష్ట్ర నదీవివాదాల చట్టం-1956లోని సెక్షన్ 3 ప్రకారం విచారణ జరిపి ఉమ్మడి ఏపీకి కేటాయించిన 1,005 టీఎంసీలు, గోదావరి డైవర్షన్ ద్వారా వచ్చే 45 టీఎంసీలు కలిపి మొత్తం 1,050 టీఎంసీల కృష్ణా జలాలను తెలంగాణ, ఏపీ మధ్య పునఃపంపిణీ చేయాలని, ఆ జలాలను ప్రాజెక్టుల వారీగా కేటాయించాలని పేర్కొంటూ నిరుడు అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను జారీచేసిన సంగతి తెలిసిందే. ఆ విచారణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఎస్‌వోసీని సమర్పించింది. తెలంగాణలోని ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపు ఆవశ్యకత తదితర అంశాలను అందులో ప్రస్తావించింది. దీనిపై ఏపీ ప్రభుత్వం తాజాగా కౌంటర్ రిజాయిండర్‌ను సమర్పించింది. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ద్వారానే రెండు రాష్ర్టాల మధ్య నదీ జలాల పంపిణీ కొనసాగుతుందని పేర్కొన్నది. ఈ నేపథ్యంలో మళ్లీ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం సరికాదని, సెక్షన్ 3 ద్వారా నూతనంగా ఇచ్చిన మార్గదర్శకాలు న్యాయవిరుద్ధమని తెలిపింది.
హైదరాబాద్, సెప్టెంబర్13 (నమస్తే తెలంగాణ) : ఏపీ మాజీ సీఎం జగన్‌తో సెల్ఫీ తీసుకున్న మహిళా కానిస్టేబుల్‌పై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గుంటూరు సబ్‌జైలులో ఉన్న బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్ వెళ్లారు. అదే జైలులో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ తన కుమార్తెతో కలిసి సెల్ఫీ తీసుకున్నారు. విధి నిర్వహణలో ఇలా వ్యవహరించడంతో కానిస్టేబుల్ ఆయేషా భానుకు ఛార్జిమెమో ఇస్తామని జైలర్ రవిబాబు తెలిపారు.