YS Sharmila | ఏపీకి బీజేపీ ఇచ్చేది గుండు సున్నా అని వైఎస్ షర్మిల అన్నారు. అయినా చంద్రబాబు పొత్తు పెట్టుకోవడం దారుణమని విమర్శించారు. బీజేపీకి చంద్రబాబు, జగన్ ఊడిగం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో శుక్రవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జగన్పై విరుచుకుపడ్డారు.
అసెంబ్లీకి పోనివాళ్లు ఎవరైనా రాజీనామా చేయాలని షర్మిల సూచించారు. జగన్ అయినా, వైసీపీ ఎమ్మెల్యేలు అయినా అసెంబ్లీకి వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే పదవులు ఎందుకు అని ప్రశ్నించారు. అసెంబ్లీకి వెళ్లకుంటే జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ నెల 11వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో తాము అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం లేదని వైఎస్ జగన్ ఇటీవల మీడియాతో తెలిపారు. ప్రతిపక్ష నాయకుడికి మైక్ ఇస్తేనే ప్రజా సమ్యలను అసెంబ్లీలో ప్రస్తావించే అవకాశం ఉంటుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం.. వైసీపీకి మైక్ ఇచ్చే పరిస్థితి లేదని తెలిపారు. అటువంటప్పుడు సమావేశాలకు హాజరవ్వడం వల్ల ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. అందుకే అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం లేదని స్పష్టం చేశారు.