AP Liquor Scam | ఏపీ లిక్కర్ స్కాంలో ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరైంది. ధనుంజయ్, కృష్ణ మోహన్, బాలాజీ గోవిందప్పకు బెయిల్ మంజూరు చేస్తూ విజయవాడలోని ఏసీబీ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఒక్కొక్కరు 2 లక్షల రూపాయల చొప్పున రెండు పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. అలాగే ముగ్గురి పాస్పోర్టు సమర్పించాలని సూచించింది.
ఇప్పటికే ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడలోని ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమతినిస్తూ బెయిల్ ఇచ్చింది. ఇందుకోసం రూ.50వేల పూచీకత్తుతో రెండు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల అనంతరం ఈ నెల 11వ తేదీన మళ్లీ రాజమండ్రి సెంట్రల్ జైలులో సరెండర్ అవ్వాలని సూచించింది.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో సీఎంవో మాజీ కార్యదర్శి కె. ధనంజయ రెడ్డి ఏ 31గా, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ఏ32గా, బాలాజీ గోవిందప్ప ఏ33గా ఉన్నారు. వీరిలో మే 13వ తేదీన బాలలాజీ గోవిందప్ప అరెస్టయ్యాడు. మే 16న ధనుంజయ్, కృష్ణమోహన్ రెడ్డి అరెస్టు అయ్యారు. ఈ ముగ్గురి ఆదేశాల మేరకు అప్పట్లో డబ్బులు వసూలు చేశామని, ఆ డబ్బులను వాళ్ల వద్దకే చేర్చామని గతంలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, చాణక్య తెలిపారు. ఈ మేరకు వారి రిమాండ్ రిపోర్టులో కూడా దీన్ని సిట్ అధికారులు పేర్కొన్నారు. ఈ రిమాండ్ రిపోర్టు ఆధారంగానే వారి పేర్లను స్కాం కేసులో చేర్చామని సిట్ అధికారులు మెమోలో తెలిపారు.