AP High Court | తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తమ పార్టీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసే ప్రయత్నం జరుగుతోందని హైకోర్టులో వైసీపీ పిటిషన్ వేసింది. సోమవారం జరిగిన ఎన్నికల ప్రక్రియ సమయంలోనూ ఇబ్బందులకు గురిచేశారని పిటిషన్లో పేర్కొంది. తమ కార్పొరేటర్లకు రక్షణ కల్పించాలని కోరింది. వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది.
కార్పొరేటర్లకు రక్షణ కల్పించాలని వైసీపీకి వినతి పత్రం అందజేయాలని వైసీపీకి ఏపీ హైకోర్టు సూచించింది. కార్పొరేటర్లు బయల్దేరి వెళ్లే దగ్గర నుంచి సెనేట్ హాల్‌కు చేరుకునే వరకు రక్షణ కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
కాగా, తిరుపతి మున్సిపల్ ఎన్నిక వేళ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓటింగ్ కోసం వైసీపీ కార్యకర్తలు ఎస్వీ యూనివర్సిటీకి వెళ్తున్న సమయంలో బస్సుపై జనసేన, టీడీపీ మూకలు దాడులకు పాల్పడ్డాయి. అంతకుముందు చిత్తూరు భాస్కర్ హోటల్లోఉన్న వైసీపీ మహిళా కార్పొరేటర్లపై జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కుమారుడు ఆరణి మదన్ దాడికి యత్నించారు. కార్పొరేటర్లను కాపాడేందుకు వెళ్లిన తిరుపతి వైసీపీ ఇన్‌ఛార్జి భూమన అభినయ్ రెడ్డిపై కూడా కూటమి నేతలు దాడికి యత్నించారు. ఇదిలా ఉండగా.. కోరం లేకపోవడంతో తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. ఈ క్రమంలోనే టీడీపీ దౌర్జన్యాలపై వైసీపీ నేతలు సీరియస్‌గా స్పందించారు.
మున్సిపల్ చైర్మన్, వైఎస్ చైర్మన్ల ఎన్నిక సమయంలో కూటమి నేతల అరాచకాలపై ఎన్నికల కమిషన్‌కు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. విజయవాడ బందర్ రోడ్డులోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని కలిసి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాశ్, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు వినతిపత్రం అందజేశారు. తిరుపతి, హిందూపురం, నెల్లూరు మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ కార్పొరేట్లపై కూటమి నేతలు దాడికి తెగబడ్డారని ఆరోపించారు. పోలీసులు కూడా చోద్యం చూసినట్లుగా ఉండిపోతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని ఏడు మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లలో జరుగుతున్న ఎన్నికలను వాయిదా వేయాలని కోరారు.