AP High Court | వైసీపీ నేతలకు ఏపీ హైకోర్టు షాకిచ్చింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. వైసీపీ నేతలు దేవినేని అవినాశ్, నందిగాం సురేశ్, అప్పిరెడ్డి సహా పలువురు పిటిషన్లను కొట్టివేసింది. అలాగే చంద్రబాబు నివాసంపై దాడి కేసులోనూ జోగి రమేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై వందలాది మంది దాడికి పాల్పడ్డారు. కార్యాలయంలోని ఇతర ఫర్నీచర్, ఇతర వస్తువులను ధ్వంసం చేయడంతో పాటు టీడీపీ నేతలపై దాడికి దిగారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ విధ్వంసానికి సంబంధించి టీడీపీ కార్యాలయం ఆపరేటర్ మదునూరి సత్యవర్దన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ ఎంపీ నందిగం సురేశ్, వైసీపీ నేత దేవినేని అవినాశ్ తదితరులు నిందితులుగా ఉన్నారు. దీంతో ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని వారు హైకోర్టును ఆశ్రయించారు.