Tirumala | విదేశాల్లో నివసిస్తున్న ఆంధ్రులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి దర్శనానికి ప్రవాసాంధ్రులకు అందించే వీఐపీ బ్రేక్ దర్శనాల కోటాను భారీగా పెంచింది. ప్రస్తుతం రోజులో 10 వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పిస్తుండగా.. వాటిని 100కు పెంచారు.
నిజానికి ప్రవాసాంధ్రులకు రోజులో 50 వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పించేవారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో ఆ కోటాను 10కి తగ్గించారు. దీంతో విదేశాల నుంచి వచ్చే తెలుగు ప్రజలు శ్రీవారి దర్శనం చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రవాసాంధ్రుల సొసైటీ(ఏపీఎన్ఆర్టీ) అధ్యక్షుడు రవి వేమూరి ఆధ్వర్యంలో ఆ సంస్థ ప్రతినిధులు గత ఫిబ్రవరిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కలిశారు. తమ సమస్యను వివరించారు. ఈ నేపథ్యంలో ఈ సమస్యపై సుదీర్ఘంగా చర్చించిన చంద్రబాబు.. రోజూ వంద వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు ఇవ్వాలని టీటీడీకి సూచించింది.
ఈ వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు బుక్ చేసుకునే ప్రవాసాంధ్రులు ముందుగా https://apnrts.ap.gov.in/ వెబ్సైట్లోకి వెళ్లి సభ్యత్వం నమోదు చేసుకోవాలి. దీనికోసం ప్రవాసులు ఉంటున్న దేశాల వీసాలు, వర్క్ పర్మిట్ల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అలా లాగిన్ అయిన తర్వాత శ్రీవారి దర్శనానికి సంబంధించిన మూడు నెలల స్లాట్లు కనిపిస్తాయి. అందులో అందుబాటులో ఉన్న టికెట్ల ఆధారంగా నచ్చిన తేదీల్లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. టికెట్ బుక్ చేసుకున్న ప్రవాసాంధ్రులు ఏపీఎన్ఆర్టీఎస్కు చెందిన పీఆర్వోలను కలిస్తే వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తారు.