Pawan Kalyan | acమొంథా తుపాను ప్రభావం పిఠాపురం నియోజకవర్గంపై తీవ్రంగా ఉండనున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో యంత్రాంగం అప్రమత్తంగా ఉండి, సర్వ సన్నద్ధతతో ఏర్పాట్లు చేశారు. పవన్ కళ్యాణ్ నిరంతరం నివేదికలు విశ్లేషించి అధికారులతో చర్చిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. ఉప్పాడ, మూలపేట, కోనపాపపేట తదితర తీర ప్రాంత గ్రామాల్లో సహాయక చర్యల పర్యవేక్షణకు గ్రామానికి ఒకరు చొప్పున ప్రత్యేక అధికారులను నియమించారు. 34మంది సభ్యులతో ఒక ఎన్.డి.ఆర్.ఎఫ్. బృందం పిఠాపురం నియోజకవర్గంలో అప్రమత్తంగా ఉంది. 34 బోట్లు సిద్ధం చేశారు. వీరికి తోడుగా 12 మంది సభ్యుల క్విక్ రెస్పాన్స్ టీమ్ సభ్యులు, 12 మంది గజ ఈతగాళ్ళు ఉన్నారు. పిఠాపురం కేంద్రంగా ఎన్.డి.ఆర్.ఎఫ్. బృందం పని చేస్తోంది.
కాకినాడ జిల్లా ప్రత్యేక అధికారి కృష్ణ తేజ, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తో టెలీ కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తూ కాకినాడ జిల్లాలో ఉన్న తుపాను ప్రభావ పరిస్థితులను ఉప ముఖ్యమంత్రి సమీక్షిస్తూ ఉన్నారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గంట గంటకు నివేదికలు తీసుకుంటున్నారు. జిల్లాతోపాటు పిఠాపురం నియోజకవర్గంలో పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.
పిఠాపురం నియోజకవర్గంలో 25 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. ఇక్కడి ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం సమీక్షిస్తుంది. ఆహారం, తాగునీరు, పాలు, అత్యవసర ఔషధాలను సమకూర్చి, వైద్య ఆరోగ్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఎక్కడైనా విద్యుత్ స్తంబాలు నేల కూలితే తక్షణమే స్పందించేలా వ్యవస్థను సన్నద్ధం చేయడంతోపాటు 500 స్తంబాలను స్టాండ్ బైగా ఉంచారు. అలాగే పశువులకు ఇబ్బంది లేకుండా అవసరమైన పశుగ్రాశాన్ని కూడా గ్రామాల్లో ఉంచారు. వీటిపాటు ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశాలను అనుసరించి- ఆకస్మిక వరదల హెచ్చరిక నేపథ్యంలో జల వనరుల శాఖ సిబ్బందిని సమాయత్తం చేశారు. పోలీసు, అగ్నిమాపక, రెవెన్యూ, పంచాయతీరాజ్ సిబ్బంది సమన్వయం చేసుకొంటున్నారు. పడా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ముఖ్యంగా తీర ప్రాంత గ్రామాల్లో పరిస్థితులను పర్యవేక్షించేందుకు గ్రామానికి ఒకరు చొప్పున ప్రత్యేక అధికారులను నియమించారు. ఉప్పాడలో బీసీ కార్పోరేషన్ ఈడీ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మూలపేట, కోనపాపపేటల్లో డివిజిన్ లెవల్ డెవలప్మెంట్ అధికారులను నియమించారు. అమీనాబాద్, అమరవిల్లిలలోనూ ప్రత్యేక అధికారులు క్షేత్ర స్థాయి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. పునరావాస శిబిరాల్లో ఉంటున్న ప్రజలకు ఆహారం ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు డి.డి.ఓ.ను, పెదపూడి తహసిల్దార్ లను నియమించారు. మండల స్థాయి అధికారులు, గ్రామ సచివాలయం సిబ్బంది మొత్తం సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నారు. గ్రామీణ నీటి పారుదల శాఖ డి.ఇ. ఆధ్వర్యంలో రక్షిత తాగు నీరు ఏర్పాటు చేశారు. పునరావాస శిబిరాల్లో 12 వేల మందికి మధ్యాహ్న భోజనం, 15 వేల మందికి రాత్రి భోజనం ఏర్పాటు చేశారు. 5 వేల పాల ప్యాకెట్లు, 1.50 లక్షల వాటర్ ప్యాకెట్లతోపాటు వాటర్ ట్యాంకర్లను కూడా సిద్ధం చేశారు. ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. నియోజకవర్గం పరిధిలో ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.