Chandrababu | జీఎస్టీ సంస్కరణలను ప్రజలకు వివరించాలని టీడీపీ నేతలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గ్రామస్థాయి కార్యకర్తలతో చంద్రబాబు నాయుడు ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలకు చంద్రబాబు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జీఎస్టీ సంస్కరణలతో పేద, మధ్య తరగతి ప్రజలకు పెద్ద ఎత్తున లబ్ది జరుగుతుందని అన్నారు. దేశంలో ఇదొక నూతన అధ్యాయమని చెప్పుకొచ్చారు. జీఎస్టీ సంస్కరణలతో ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను ప్రజలకు వివరించాలని సూచించారు. జీఎస్టీ ఉత్సవ్‌లో భాగంగా కొత్త సంస్కరణలను వివరించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 60 వేల సమావేశాలు నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు.
పారిశ్రామిక, ఆటో మొబైల్, ఫార్మా వంటి కంపెనీలకు జీఎస్టీ సంస్కరణలతో మేలు జరుగుతుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. టూవీలర్, కార్లు, ఏసీ, వంటింటి వస్తువలుపైనా ధరలు తగ్గుతాయని తెలిపారు. జీఎస్టీ సంస్కరణలతో 8 కోట్ల మేర లబ్ధి జరుగుతుందని చెప్పారు. ఏపీకి వచ్చే ఆదాయం తగ్గినా సంస్కరణలతో ప్రజలు ఆర్థికంగా బలోపేతమవుతారని అన్నారు.
ఈ సందర్భంగా వైసీపీ నాయకులపై సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రారని.. అదే వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు మాత్రం సభకు వస్తున్నారని తెలిపారు. ఇదేం ద్వంద్వ వైఖరి.. ఇది డ్రామా కాదా అని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలైనా, నాయకులైనా ప్రజలకు ఎప్పుడూ దగ్గరగా ఉండాలని సూచించారు. ఎన్నికల సమయంలోనే ప్రజల దగ్గరకు వెళ్తానంటే ప్రజలు హర్షించరని చెప్పుకొచ్చారు. గత జగన్ ప్రభుత్వం విద్యుత్ శాఖను సంక్షోభంలోకి నెట్టిందని ధ్వజమెత్తారు. వైసీపీ అసమర్థ విధానాలతో ప్రజలపై విద్యుత్ ఛార్జీల రూపంలో భారం పడిందని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టామని వివరించారు. ఏపీలో అనేక సమస్యలను పరిష్కరించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో విద్యుత్ కొనుగోళ్లలో సుమారు వెయ్యి కోట్లు ఆదా చేశామని వివరించారు.