Chandrababu | గత ప్రభుత్వ ఐదేళ్ల విధ్వంస పాలనతో అందరూ నష్టపోయారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా అధికారులంతా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడారు.
గత ప్రభుత్వం కలెక్టర్లతో కాన్ఫరెన్స్ పెట్టి ప్రజావేదిక కూల్చివేసిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజావేదిక కూల్చివేతతో గత ప్రభుత్వంలో విధ్వంసం మొదలైందని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో విధ్వంసం, బెదిరింపులు చూశామని చెప్పారు. చిన్న తప్పు జరిగితే సరిచేయొచ్చని సూచించారు. కానీ విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని పునర్నిర్మించాలంటే కష్టపడాలని తెలిపారు. మన నిర్ణయాలకు రాష్ట్ర భవిష్యత్తును మార్చే శక్తి ఉందని అన్నారు. మనమంతా కష్టపడితే 2047 నాటికి మూడో అతిపెద్ద ఎకానమీగా ఇండియా ఎదుగుతుందని అభిప్రాయపడ్డారు.
ఒకప్పుడు ఏపీ అధికారులంటే ఢిల్లీలో గౌరవం ఉండేదని చంద్రబాబు అన్నారు. ఏపీ నుంచి వెళ్లిన వాళ్లు ఆర్బీఐ గవర్నర్లుగా, కేంద్ర ప్రభుత్వంలోనూ కీలకంగా వ్యవహరించారని గుర్తుచేశారు. ఇప్పుడు అసమర్థులుగా ముద్రపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ చరిత్ర తిరగ రాయబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకుపోవాలని సూచించారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి అధికారులంతా అంకితం కావాలని పిలుపునిచ్చారు.
ప్రపంచంలోనే అత్యధిక తలసరి ఆదాయం సంపాదించేది భారతీయులే అని చంద్రబాబు అన్నారు. అందులో 33 శాతం తెలుగువాళ్లే అని చెప్పారు. గడిచిన ఐదేళ్లలో అందరం బాధపడ్డామని.. అందుకే ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చారని తెలిపారు. చరిత్రలోనే ఎన్నడూ రానంత పెద్ద విజయం ఇది అని పేర్కొన్నారు. ప్రజలు గెలిచారని.. తమను గెలిపించారని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ప్రజలకు మాట ఇచ్చామన్నారు. ఆ దిశగానే ముందుకు వెళ్తామని.. బాధ్యతతో పనిచేస్తామని తెలిపారు.
గత ఐదేళ్లలో ఒక్క కలెక్టర్ల కాన్ఫరెన్స్ కూడా పెట్టలేదని చంద్రబాబు మండిపడ్డారు. ఇకపై ప్రతి మూడు నెలలకు ఒకసారి కాన్ఫరెన్స్ ఉంటుందని చెప్పారు. తాను కూడా సమయపాలన పాటిస్తానని పేర్కొన్నారు. గంటలు గంటలు ఉపన్యాసాలు ఇవ్వనని చెప్పారు. తన పనితీరుపైనా రివ్యూ ఉంటుందని అన్నారు. ఎవరు పనిచేయకపోయినా చర్యలు తప్పవని హెచ్చరించారు. మార్క్ క్రియేట్ చేసుకునేలా కలెక్టర్లు పనిచేయాలని అన్నారు. రాష్ట్ర విభజన కంటే కూడా గత పాలన వల్ల ఎక్కువ నష్టపోయామని తెలిపారు. రూ.10లక్షల కోట్ల అప్పు చేశారని.. అన్ని వ్యవస్థలను విధ్వంసం చేశారని అన్నారు. ఎన్నడూ లేనంతగా గత ఐదేళ్లలో భూకబ్జాలు జరిగాయని అన్నారు. చివరకు సర్వే రాళ్లపైనా ఫొటోలు వేసుకున్నారని మండిపడ్డారు. బటన్ నొక్కామని గత ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది.. కానీ పేదరికం నిర్మూలన గురించి ఎప్పుడూ ఆలోచన చేయలేదన్నారు. పేదరిక నిర్మూలన, సంపద సృష్టిపై దృష్టి పెట్టాలని అన్నారు.