Chandrababu | వైసీపీ హయాం రాష్ట్రానికి చీకటి యుగమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో గ్రామాల్లో ఎలాంటి పనులు జరగలేదని విమర్శించారు. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో శుక్రవారం నిర్వహించిన గ్రామసభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు న్యాయం జరిగేలా పాలన మొదలుపెట్టామని తెలిపారు.
గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి సాధ్యమని చంద్రబాబు అన్నారు. 2014-19 మధ్య గ్రామాభివృద్ధికి స్వర్ణయుగమని తెలిపారు. గత ప్రభుత్వంలో గ్రామాల్లో అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు. నరేగా నిధులను కూడా వైసీపీ నేతలు తమ జేబుల్లో వేసుకున్నారని అన్నారు. జగన్కు రంగుల మీద ఉన్న పిచ్చి పేదల మీద లేదని విమర్శించారు.
పేదలకు న్యాయం జరిగేలా పాలన మొదలుపెట్టామని చంద్రబాబు తెలిపారు. రాబోయే ఐదేళ్లలో అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేస్తామని పేర్కొన్నారు. పశువుల షెడ్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. గ్రామాల్లోని పేదలకు ఇళ్లు కట్టించే బాధ్యత తీసుకుంటామని తెలిపారు. వైసీపీ పాలనకు, తమ పాలనకు బేరీజు వేయండని పేర్కొన్నారు. తమ హయాంలో వేసిన వీధి దీపాలను కూడా వైసీపీ నేతలు దొంగిలించుకుపోయారని విమర్శించారు. వైసీపీ భూతాన్ని పూర్తిగా భూ స్థాపితం చేస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని అన్నారు. కేంద్ర సహాయంతో గ్రామాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
సామాజిక పెన్షన్లు పెంచిన ఘనత టీడీపీదే అని చెప్పారు.