Chandrababu | ఏపీ రాజధాని అమరావతిని సింగపూర్‌లా తయారుచేస్తానని అప్పట్లో హామీ ఇచ్చానని ఏపీ సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. కానీ 2019లో ఏపీలో ప్రభుత్వం మారడంతో అమరావతి నిర్మాణం ఆగిపోయిందని.. అందుకే ఇప్పుడు రాష్ట్ర పున: నిర్మాణం చేపట్టానని తెలిపారు. సింగపూర్ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు తెలుగు డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏసియా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సింగపూర్ ప్రజల ఉత్సాహం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదం కావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1995లో తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు సింగపూర్ రాలేదని.. అమెరికా వెళ్లానని చంద్రబాబు తెలిపారు. అప్పుడు 15 రోజులు తిరిగి అన్ని ఐటీ కంపెనీలను కలిశానని పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌ను కూడా కలిశానని చెప్పారు. అమెరికా మొత్తం తిరిగి ఐటీ కంపెనీలను ఏపీకి తీసుకొచ్చేందుకు కృషి చేశానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు నేరుగా సింగపూర్ వచ్చానని తెలిపారు. మాకు రాజధాని లేదని.. రాజధాని నిర్మాణం కోసం మాస్టర్ ప్లాన్ డిజైన్ చేసి ఇవ్వమని అడిగానని తెలిపారు. తన మాట మేరకు అప్పటి సింగపూర్ ప్రధాని తమ సెంట్రల్ కేబినెట్‌తో చర్చించి.. ఉచితంగా మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇచ్చారని పేర్కొన్నారు.
సింగపూర్ ప్రభుత్వం అప్పటికే చాలా దేశాల్లో టౌన్‌షిప్‌లు, ఇండస్ట్రీయల్ టౌన్‌షిప్‌లు కట్టారని.. అందుకే తమ రాష్ట్రానికి క్యాపిటల్ చేయమని అడిగానని తెలిపారు. సింగపూర్ ప్రభుత్వం భాగస్వామ్యం అయితే ప్రపంచాన్ని మొత్తం అమరావతికి తీసుకొస్తారని అనుకున్నామని వివరించారు. దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు వీళ్లకు ల్యాండ్ ఇచ్చి.. అభివృద్ధి చేయించామని చెప్పారు. కానీ 2019లో ప్రభుత్వం మారిందని.. దాంతో అమరావతి నిర్మాణం ఆగిపోయిందని తెలిపారు. సింగపూర్ ప్రభుత్వాన్ని తప్పుపట్టే పరిస్థితి తీసుకొచ్చారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులకు ఇప్పటికీ చాలా బాధపడుతున్నానని అన్నారు. అందుకోసమే రాష్ట్ర పున:నిర్మాణం చేపట్టామని తెలిపారు. ఈ క్రమంలోనే సింగపూర్‌కు ఎందుకు వచ్చారో చంద్రబాబు వివరించారు. మళ్లీ పెట్టుబడులను సాధిస్తాను కానీ.. రాష్ట్ర ప్రతిష్ట, బ్రాండ్ పోతే శాశ్వతంగా ఏపీ నష్టపోతుందని భావించానని అన్నారు. అందుకే ఏపీలో జరిగిన నష్టాన్ని సింగపూర్‌కు వచ్చి ఇక్కడి ప్రభుత్వానికి జరిగిన అన్యాయాన్ని వివరించానని అన్నారు. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దాలనే సింగపూర్ పర్యటనకు వచ్చానని స్పష్టం చేశారు.