Chandrababu | ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తామని సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. బుడమేరు ఆక్రమణలను తొలగిస్తామని తెలిపారు. విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల పరిశీలన అనంతరం కలెక్టరేట్ వద్ద చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.
వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన ఉందని హెచ్చరికలు ఉన్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఏలేరు రిజర్వాయర్‌కు ఎక్కువ వరద వచ్చే అవకాశం ఉందని.. విశాఖ, ఏజెన్సీలో కొండచరియలు జారీపడే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల్లో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని చెప్పారు.
విజయవాడలో ఎనిమిదో రోజు కూడా బాధితులు వరద నీటిలోనే ఉన్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇవాళ కూడా ఆహారం, తాగునీరు అందించామని, కూరగాయలు పంపిణీ చేశామని చెప్పారు. వరద ప్రాంతాల్లో 260 ట్యాంకర్లు తిరుగుతున్నాయని, 1200 వాహనాల ద్వారా రేషన్ సరకులు సరఫరా చేస్తున్నామని తెలిపారు. వరద ప్రాంతాల్లో 0.51 టీఎంసీల నీళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. బుడమేరు ప్రాంతంలో ఇంకా నీరు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అయినప్పటికీ విజయవాడకు పెద్ద ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. బుడమేరు మళ్లీ పొంగితే కొంత ఇబ్బంది వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. త్వరలోనే ఆపరేషన్ బుడమేరు చేపడతామని పేర్కొన్నారు. ఆక్రమణల తొలగింపునకు పటిష్ట చట్టం తెస్తామని తెలిపారు.