Weight Loss | చిన్నగా ఉన్నప్పటికీ చియా విత్తనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రక్తపోటును తగ్గించడంలో, పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, బరువును అదుపులో ఉంచడంలో ఇవి ఎంతో సహాయపడతాయి. ఫైబర్, మొక్క ఆధారిత ప్రోటీన్ తో పాటు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు వీటిలో పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. చక్కటి ఆరోగ్యం కోసం వీటిని చాలా మంది ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. అలాగే చాలా మందికి వీటిని ఏ సమయంలో తీసుకోవాలి అనే సందేహం కూడా కలుగుతూ ఉంటుంది. గరిష్ట ఫైబర్ ప్రయోజనాల కోసం చియా విత్తనాలను ఏ సమయంలో తీసుకోవాలి.. ఎంత మోతాదులో తీసుకోవాలి.. వీటిని ఎలా తీసుకోవడం వల్ల మేలు కలుగుతుందో.. వైద్యుల మాటల్లో తెలుసుకుందాం.
ఒక టేబుల్ స్పూన్ చియా విత్తనాల్లో సుమారు 4 నుండి 5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. వీటిలో కరిగే, కరగని రెండు రకాల ఫైబర్ లు ఉంటాయి. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, ప్రేగు కదలికలను పెంచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ఈ ఫైబర్ ఎంతో సహాయపడుతుంది. చియా విత్తనాల్లో ఉండే కరిగే ఫైబర్ కారణంగా జెల్ లాంటి స్థిరత్వం ఏర్పడుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి, కడుపు నిండిన భావనను కలిగించడంలో సహాయపడుతుంది. ఇక వీటిని తీసుకునే సమయాన్ని బట్టి శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రోజంతా శక్తి స్థాయిలు స్థిరంగా ఉంటాయి. రాత్రి సమయంలో తీసుకోవడం వల్ల పేగుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే భోజనానికి ముందు వీటిని తీసుకోవడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. తద్వారా శరీర బరువు అదుపులో ఉంటుంది.
వీటిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వుల కారణంగా వీటిని చిరుతిండిగా కూడా తీసుకోవచ్చు. పెరుగు లేదా సలాడ్ వంటి వాటితో వీటిని సులభంగా కలిపి తీసుకోవచ్చు. అయితే నిద్రించే ముందు వీటిని తీసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు. చియా గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కనుక వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఉబ్బరం, జీర్ణ వ్యవస్థలో అసౌకర్యంగా ఉండడం వంటివి జరుగుతాయి. కనుక వీటిని మొదటగా తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. మొదట ఒక టేబుల్ స్పూన్ తో ప్రారంభించి నెమ్మదిగా 2 టేబుల్ స్పూన్ల మోతాదులో తీసుకోవాలి. రోజుకు 3 టేబుల్ స్పూన్ల కంటే ఎక్కువగా వీటిని తీసుకోకూడదు. ఇక చియా విత్తనాలను తీసుకునే ముందు అరగంట పాటు నీటిలో నానబెట్టాలి. నీటిని ఎక్కువగా తాగాలి. వీటిని పొడిగా తీసుకోకూడదు. అదే విధంగా జీర్ణ సమస్యలు, మింగడంలో ఇబ్బంది ఉన్నవారు, ఇతర అనారోగ్య సమస్యలకు మందులు వాడే వారు చియా విత్తనాలను తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఈ విధంగా తగిన జాగ్రత్తలను తీసుకుంటూ చియా విత్తనాలను తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను అధిక మొత్తంలో పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు.