Chandrababu | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పండగపూట కూడా పచ్చి అబద్ధాలు చెబుతున్నాడని వైసీపీ మండిపడింది. విధి నిర్వహణలో భాగంగా చేయాల్సిన అతి సాధారణ విషయాలను కూడా తానేదో గొప్పగా సాధించినట్లుగా ప్రచారం చేసుకుంటున్నాడని విమర్శించింది. ఎన్నికల ముందు చెప్పిన సూపర్ సిక్స్ హామీలన్నింటిని ఎగ్గొట్టి బకాయిల చెల్లింపులు కూడా `సంక్రాంతి గిఫ్ట్`గా ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు అని అన్నారు.
ఉద్యోగులను లంచగొండులుగా చిత్రీకరించిన మీరు, ఉద్యోగుల పట్ల ఏ మాత్రం గౌరవం లేకుండా మాట్లాడే మీరు, ఇప్పుడేదో ఉద్యోగులకు అంతా తానే చేస్తున్నట్లు కపట ప్రేమ ప్రదర్శించడం మీకే చెల్లింది చంద్రబాబు అని వైసీపీ విమర్శించింది. విద్యుత్ సంస్థ ఉద్యోగుల్లో 66 శాతం, పౌర సరఫరాల సంస్థలో 65 శాతం, రెవెన్యూలో 64 శాతం, పోలీస్ శాఖలో 62 శాతం, స్థానిక సంస్థల్లో 52 శాతం అవినీతి పరులే ఉన్నారని మీ `మనుసులో మాట` పుస్తకంలో రాసుకోలేదా అని ప్రశ్నించింది.
ఉమ్మడి ఏపీలో పెన్షనర్లకు డీఏని రద్దు చేసిన చరిత్ర మీది కాదా చంద్రబాబు అని వైసీపీ నిలదీసింది. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ తేవాలని ఉద్యోగులు అడిగితే మీరు ససేమిరా అనలేదా? ప్రభుత్వ రంగాన్ని మూసి వేయడం, వీఆర్ఎస్ కూడా ఇవ్వకుండా గోల్డెన్ హ్యాండ్ షేక్ అంటూ ఉద్యోగులను ఇంటికి పంపేయడంలో మీకు ఘనమైన చరిత్ర లేదా? ఉద్దేశపూర్వంగా ఉద్యోగులను తగ్గించిన చరిత్ర మీది కాదా?1999 నుంచి 2004 మధ్య ఆల్విన్, నిజాం షుగర్స్, రిపబ్లిక్ ఫోర్బ్స్, చిత్తూరు డెయిరీ, ప్రకాశం డెయిరీ వంటి 54 ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసి, అతి తక్కువ ధరకు మీ మనుషులకు కట్టబెట్టింది వాస్తవం కాదా? రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షలు ఆరోగ్య బీమా కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని తుంగలో తొక్కింది మీరు కాదా? ఆరోగ్యశ్రీకి మీరు మంగళం పాడింది వాస్తవం కాదా? వైద్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్న మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించింది.
ప్రతి క్వార్టర్ అయిపోయిన వెంటనే ఫీజులు చెల్లించే పరిస్థితులు నాడు ఉంటే.. ప్రస్తుతం రూ.2,800 కోట్ల విద్యా దీవెన బకాయిలు ఉన్నాయని వైసీపీ తెలిపింది. రూ.1100 కోట్లు వసతి దీవెన బకాయిలు ఉన్నాయని పేర్కొంది. ఇలా ఉంటే విద్యార్థులకు `ఆనంద సంక్రాంతి` అంటూ కేవలం రూ.788 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం విద్యార్థులకు న్యాయం చేయడమా? అని పేర్కొంది. చంద్రబాబూ.. ప్రతి రైతు కూడా ఎమ్మెస్పీ ప్రకారం రావాల్సిన రేటు బస్తాకు రూ.1720 అయితే, రూ.300 నుంచి రూ.400 వరకు తక్కువకు అమ్ముకోవాల్సిన పరిస్థితి రావడానికి కారణం మీరు కాదా? దళారులే ధాన్యం కొంటున్నారంటే అందుకు మీరు కారణం కాదా? మీ పాలనలో విద్యుత్ రంగం కుదేలైందన్న మాట వాస్తవం కాదా? మీరు అధికారంలోకి రాకముందు డిస్కంలకు రూ.29 వేల కోట్ల అప్పులు, బకాయిలు ఉంటే, మీరు దిగిపోయే నాటికి అవి ఏకంగా రూ.86 వేల కోట్లకు ఎగబాకింది వాస్తవం కాదా? దాదాపుగా 23.88 శాతం సీఏజీఆర్‌తో మీ హయాంలో డిస్కంల పరిస్థితి దయనీయంగా మారింది నిజం కాదా? ఇలా మీ పాలన అంతా తిరోగమనంలో సాగుతుంటే ఏదో ఘనకార్యం చేసినట్లు గొప్పలు చెప్పుకోవడానికి మీకు సిగ్గుగా లేదా చంద్రబాబు అని మండిపింది.