Chandrababu | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. ఏపీ ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించిన నేపథ్యంలో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు వస్తే కరువు వస్తుందని అన్నారు. చంద్రబాబు, కరువు కవల పిల్లలు అనేది నానుడి అని ఎద్దేవా చేశారు.
ఈ ఏడాది నైరుతి అనుకూలించినా రాయలసీమలో కరువు నీడలు వెంటాడుతున్నాయని విజయసాయిరెడ్డితెలిపారు. ఐదు జిల్లాలలో 54 మండలాల్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. ఈ ఏడాది కొన్ని ప్రాంతాల్లో అతివృష్టి, కొన్ని ప్రాంతాల్లో అనావృష్టి ఉందని అన్నారు. వైసీపీ హయాంలో రైతులపై పైసా భారం పడకుండా ఐదేళ్లపాటు ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తే టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని పక్కన పెట్టి రైతుల ఉసురు తీసుకుంటున్నారని మండిపడ్డారు.
ఖరీఫ్ సీజన్ 2024కి సంబంధించి ఏపీ ప్రభుత్వం కరువు మండలాల జాబితాను మంగళవారం ప్రకటించింది. ఐదు జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా 54 మండలాలు కరువు ప్రభావితానికి గురయ్యాయని తెలిపింది. ఈ మేరకు ఆయా మండలాలను కరువు మండలాలుగా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
కర్నూలు, అనంతపురం శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఉన్న ఈ 54 మండలాల్లో వర్షపాతం సాధారణం కంటే చాలా తక్కువగా నమోదు కావడంతో ఈ దుర్భి్క్ష పరిస్థితులు నెలకొన్నాయని ఏపీ ప్రభుత్వం ఆ జీవోలో తెలిపింది. వీటిలోని 27 మండలాల్లో తీవ్రమైన దుర్భిక్షం ఉంటే.. మరో 27 మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు ఉన్నాయని పేర్కొంది. కలెక్టర్లు ఆయా జిల్లా గెజిట్లలో కరువు మండలాలను నోటిఫై చేసి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు.