Siddharth Kaushal | ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఉద్యోగానికి రాజీనామా (VRS) చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆయన బుధవారం లేఖను విడుదల చేశారు. తన రాజీనామా విషయంలో ఎలాంటి బలవంతంగా, వేధింపులు లేవంటూ రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో రాజీనామా చేసినట్లుగా జరుగుతున్న ప్రచారమంతా అవాస్తవమన్నారు. ఏపీలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్న ఆయన.. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
ఉద్యోగ కాలంలో సహకరించిన ప్రభుత్వానికి, సహచరులకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఆయన కృష్ణా, ప్రకాశం, వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీగా సేవలందించారు. ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో ఎస్పీ (అడ్మిన్)గా పని చేస్తున్నారు. తన ఉద్యోగానికి రాజీనామా లేఖను ఏపీ డీజీపీ పంపినట్లు పేర్కొన్నారు. తాను ఐఐఎం స్టూడెంట్‌నని.. తనకు మంచి ఆఫర్ రావడంతో ఐపీఎస్ ఉద్యోగానికి స్వస్తి చెప్పినట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఏపీ తన సొంత రాష్ట్రంగానే భావిస్తానన్నారు. అయితే, ఇటీవల ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కారణంగా సిద్ధార్థ్ కౌశల్ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆయన రాజీనామాపై స్పష్టత ఇచ్చారు.
Siddharth Kaushal Letter