Tirumala | సంచలనం సృష్టిస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి ఇప్పటివరకూ నోరు మెదపకపోవడంపై బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ధర్మా రెడ్డి కనిపించడం లేదని ఒక ఫ్లెక్సీని విడుదల చేశారు. ఆయన ఆచూకీ తెలిపిన వారికి రూ.1116 బహుమతిగా ఇస్తానని ఆ ఫ్లెక్సీలో పేర్కొన్నారు.
తిరుమల లడ్డూ వివాదంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంటే టీటీడీ ఈవోలుగా పనిచేసిన జవహర్ రెడ్డి, ధర్మారెడ్డి మాత్రం తేలు కుట్టిన దొంగల్లా దాక్కున్నారని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. లడ్డూ వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ వేగంగా దర్యాప్తు చేసి అనుమానాలు, చర్చలకు పుల్‌స్టాఫ్ పెట్టాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఆలయ సంప్రదాయాలను గౌరవించాలని అర్చకులు, జీయర్లను కోరారు.
తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను దుమారం లేపింది. లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని.. అందులో జంతువుల కొవ్వులు వాడారన్న వార్తలపై హిందూ సంఘాలు, కూటమి నేతలు భగ్గుమంటున్నారు. ఈ ఆరోపణలను వైసీపీతో పాటు టీటీడీ మాజీ చైర్మన్లు భూమన కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి తదితరులు విమర్శిస్తూనే ఉన్నారు. కానీ మాజీ ఈవో ధర్మారెడ్డి మాత్రం ఇప్పటివరకు దీనిపై స్పందించలేదు. అంతేకాదు ఇప్పటివరకు ఆయన ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు.
ధర్మారెడ్డి ఎక్కడ ఉన్నా బయటకు రావాలని, తిరుమల లడ్డూ వివాదంపై స్పందించాలని మూడు రోజుల క్రితం టీడీపీ నేత బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. ప్రజల్లోకి వచ్చి.. అప్పుడు జరిగిన విషయాలను బయటపెట్టాలని కోరారు. ధర్మారెడ్డి ఏమయ్యాడు.. మాజీ మంత్రి వివేకా తరహాలో ఆయన్ను కూడా చంపేశారా అనే అనుమానం కూడా వ్యక్తం చేశారు. అయినప్పటికీ ధర్మారెడ్డి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇలాంటి సమయంలో ధర్మారెడ్డి కనబడుట లేదు అని బీజేపీ నేత పోస్టర్లు వేయించడం గమనార్హం.