Gaddar | గద్దర్‌కు పద్మ అవార్డు ఇవ్వాలన్న అంశంపై కాంగ్రెస్, బీజేపీ మధ్య రెండు మూడు రోజులుగా వాగ్వాదం జరుగుతుంది. నక్సల్ భావజాలం ఉన్న వ్యక్తికి అవార్డులు ఎలా ఇస్తారని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నిస్తుంటే.. గద్దర్‌కు అవార్డు ఎందుకు ఇవ్వరని సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలను నిలదీస్తూనే ఉన్నారు. పద్మ అవార్డుల ఎంపికై తెలంగాణలో మొదలైన ఈ చిచ్చు ఇప్పుడు ఆంధ్రాకు కూడా పాకింది. గద్దర్‌కు పద్మ అవార్డు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేయడంపై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షులు విష్ణువర్దన్ మండిపడ్డారు. రాజ్యాంగాన్ని విశ్వసించని వ్యక్తికి పద్మ పురస్కారం ఎలా ఇస్తారని నిలదీశారు.
నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజాస్వామ్యబద్దంగా బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేస్తే.. గద్దర్ మాత్రం నక్సలైట్లతో కలిసి ఎంతోమందిని హత్య చేయించారని విష్ణువర్దన్ రెడ్డి ఆరోపించారు. గద్దర్‌ను ఎల్టీటీ ప్రభాకరన్, నయీమ్‌తో పోల్చారు. అనేక మంది పోలీసులను చంపిన కేసులో కోర్టులకు తిరగలేనని రాష్ట్రపతికి గద్దర్ లేఖ రాసుకున్నారని గుర్తుచేశారు. గద్దర్ కుమార్తె వెన్నెల ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారు కాబట్టి గద్దర్‌కు పద్మ పురస్కారం ఇవ్వాలా అని రేవంత్ రెడ్డిని నిలదీశారు. రాజీవ్‌గాంధీని చంపిన వారికి కూడా పద్మ పురస్కారం ఇవ్వమంటారా అని ప్రశ్నించారు. గద్దర్‌కు ఎల్టీటీ తీవ్రవాదులకు తేడా లేదని వ్యాఖ్యానించారు.
మాజీ మావోయిస్టు, రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన వ్యక్తికి ఏ హోదాలో పద్మ అవార్డు ఇవ్వాలని అడుగుతున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై విష్ణువర్దన్ రెడ్డి మండిపడ్డారు. ఉగ్రవాదాలకు కూడా పద్మ అవార్డులు అడుగుతారా అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పద్మ అవార్డుల గురించి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. పద్మ అవార్డుల ఎంపిక ప్రక్రియ తెలియని వాళ్లు రేవంత్‌కు సలహాలు ఇస్తున్నట్లు ఉందని అన్నారు.