అనంతపురంలో దారుణం జరిగింది. తన భార్య తనకు దూరం కావడానికి పక్కింటి మహిళనే కారణమని ఓ ఆటో డ్రైవర్ భావించాడు. ఆమెపై పగ పెంచుకుని ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలో ఆమె ఐదేళ్ల కుమారుడిని ఎత్తుకెళ్లి అతి కిరాతంగా హతమార్చాడు.
అనంతపురం నగరంలోని అరుణోదయ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ పెన్నయ్య తన భార్య సావిత్రితో కలిసి ఉండేవాడు. గోవిందహరి ఇంటి సమీపంలో పెన్నయ్య, సావిత్రి దంపతులు నివాసం ఉంటున్నారు. సావిత్రి, పక్కింటి నాగవేణి ఇద్దరూ స్నేహితులు. పెన్నయ్యతో గొడవ జరిగినప్పుడు నాగవేణి దగ్గరకు సావిత్రి వెళ్లేది. దీంతో తన భార్య సావిత్రికి లేనిపోనివి చెప్పి.. తమ మధ్య మనస్పర్థలు పెరిగేలా చేసిందని నాగవేణిపై పెన్నయ్య పగ పెంచుకున్నాడు. ఆమెపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని అనుకున్నాడు.
ఈ క్రమంలో ఈ నెల 25వ తేదీన అర్ధరాత్రి గోవిందహరి, నాగవేణి దంపతులు తమ కుమారుడు నాగ సుశాంత్ (5)ను ఇంట్లోనే వదిలేసి టిఫిన్ కోసం ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లారు. ఇది గమనించిన పెన్నయ్య నిద్రపోతున్న బాబును ఎత్తుకెళ్లి గొంతు నులిమి చంపేశాడు. అనంతరం గోనె సంచిలో చుట్టి దోబీఘాట్లోకి విసిరేశాడు. అయితే సావిత్రి దంపతులు ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి బాబు కనిపించలేదు. చుట్టుపక్కల కనిపించకపోవడంతో ఆచూకీ దొరక్కపోవడంతో ఆదివారం నాడు అనంతపురం త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి.. పెన్నయ్యనే హతమార్చినట్లు గుర్తించారు. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.