AP News | పిల్లాడి స్కూల్ ఫీజు కట్టాలని తెలిసిన వ్యక్తి నుంచి పది వేల రూపాయలు అప్పుగా తీసుకోవడమే పాపమైపోయింది. రూ.10వేలకు వడ్డీ మీద వడ్డీతో రెండు నెలల్లో రూ.24వేలు చెల్లించింది. అయినప్పటికీ అదంతా వడ్డీ కింద జమచేసుకున్నానని అసలు కట్టాలని వేధించాడు ఆ వడ్డీ వ్యాపారి. డబ్బులు ఎప్పుడు కడతావని నోటికొచ్చిన తిట్లు తిట్టాడు. దీంతో తన పరువు పోయిందని భావించిన మహిళ.. ఆ అవమానంతోనే ఆత్మహత్యకు యత్నించింది. ఏపీలోని చిత్తూరు నగరంలో ఈ ఘటన చోటుసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా కేంద్రంలోని కన్నయ్యనాయుడు కాలనీకి చెందిన ప్రియకు ముగ్గురు పిల్లలు. భర్త కూలీ పనులు చేస్తుంటే.. ప్రియ నాలుగు ఇళ్లలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో పిల్లాడి స్కూల్ ఫీజు కట్టేందుకు రెండు నెలల కింద రాజా అనే వ్యక్తి నుంచి రూ.10వేలు అప్పుగా తీసుకున్నారు. ఇందుకు గానూ ప్రతివారం రూ.3వేల చొప్పున రెండు నెలలు చెల్లించారు. అయినప్పటికీ ఇంకా డబ్బులు కట్టాలని రాజా వేధించాడు.
ఇప్పటివరకు కట్టిన మొత్తాన్ని వడ్డీ కింద జమ చేసుకున్నానని.. అసలు రూ10వేలు ఇచ్చి తీరాల్సిందేనని ప్రియను రాజా బెదిరించాడు. డబ్బులు చెల్లించాలని ప్రియకు ఫోన్ చేసి అసభ్యంగా తిడుతూ వేధించాడు. దీంతో అవమానం భరించలేక ఆదివారం మధ్యాహ్నం నాడు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది. మెసానిక్ మైదానం సమీపంలోని రైల్వే పట్టాలపై పడుకుంది. అయితే మరో 15 నిమిషాల్లో రైలు వస్తుందనగా.. ప్రియను గుర్తించిన జ్ఞానరాజ్ అనే వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రియను బలవంతంగా పట్టాలపై నుంచి పక్కకు లాక్కెళ్లారు. అనంతరం ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుందో కారణాన్ని తెలుసుకున్నారు. ప్రియను వేధించిన రాజాపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని కోసం గాలింపు చేపట్టారు.