అమరావతి : ఏపీలోని తూర్పు గోదావరి ( East Godavari ) జిల్లాలో ఓ పులి ( Tiger ) ప్రజలను, అధికారులను కంటి మీద కునుకు లేకుండా తప్పించుకుని తిరుగుతుంది. గత వారం రోజులుగా పులి పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ పశువులను( Animals ) చంపితింటుండడంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
రోజుకో గ్రామ పరిసర ప్రాంతాల్లో పులిని పట్టుకునేందుకు అటవీ అధికారులు, పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో పులి ఎప్పుడు వచ్చి మీద పడుతుందోమోనన్న భయం ప్రజల్లో తీవ్రంగా నెలకొని ఉంది. పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో అధికారులు సీసీ కెమెరాలు అమర్చడంతో పులిజాడను కనుగొన్నారు. అయితే పరిసర ప్రాంతాల్లో వెతికినా కనిపించకపోవడంతో అటవి అధికారులు రెస్క్యూ టీంతో గాలింపు మొదలు పెట్టారు.
స్థానికులను అప్రమత్తం చేసేందుకు గురువారం జిల్లాలోని జి.ఎర్రంపాలెంలో కలెక్టర్ కీర్తి ( Collector Keerthi ) , ఎస్పీ, అటవీ శాఖ అధికారులు పర్యటించారు. పులిని త్వరలో బంధిస్తామని ప్రజలకు భరోసా కల్పించారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా పులి కదలికలను విశ్లేషిస్తున్నామని, థర్మల్ డ్రోన్స్ ద్వారా పులిజాడను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని సూచించారు. రాత్రిపూట ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు. పులిని పట్టుకునేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.