New Delhi : దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా నేరాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మద్యం మత్తులో ఉన్న యువకులు అమ్మాయిల్ని వేధించారు. అది అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో యువకుడిపై తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటన మంగళవారం ఉదయం ఢిల్లీలోని దక్షిణ ప్రాంతమైన మెహ్రౌలీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముగ్గురు యువతులు ఉదయం ఐదు గంటల సమయంలో ఇగ్నో రోడ్డులోని అనుపమా అపార్ట్మెంట్ వద్ద క్యాబ్ కోసం వేచి చూస్తున్నారు.
ఈ సమయంలో రెండు బైకులపై అక్కడికి వచ్చిన నలుగురు పోకిరీలు ఆ యువతుల్ని వేధించడం మొదలుపెట్టారు. అసభ్య కామెంట్లు చేస్తూ, అనుచితంగా ప్రవర్తించారు. ఇదే సమయంలో రోడ్డుపై అటుగా వెళ్తున్న ముఖేష్ అనే డ్రైవర్ ఆ యువకుల్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో కోపంతో ఊగిపోయిన ఆ నలుగురు యువకులు.. అతడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా కొట్టారు. ఒక రాయితో అతడి తలపై కొట్టడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. ఇదే సమయంలో ఒక టీ స్టాల్ నడిపే వ్యక్తి వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. అతడిని కూడా బెదిరించారు. దీంతో అతడు పక్కనే ఉండిపోయాడు. అయితే, ఈ ఘటనను బాధిత యువతుల్లో ఒకరు మొబైల్లో వీడియో తీశారు. మరొకరు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
అప్పటికే నిందితులు తమ బైకుపై అక్కడినుంచి వెళ్లిపోయారు. యువతుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నలుగురు నిందితుల్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు బాధితుడు యువకుడిని ముందుగా స్థానిక మదన్ మోహన్ మాల్వియ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. మెరుగైన చికిత్స కోసం సఫ్దర్గంజ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్తితి కాస్త విషమంగానే ఉంది. తలలో అనేక గాయాలైనట్లు, అలాగే ముక్కు, నోరు, కంటికి కూడా గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. తాత్కాలికంగా స్పృహ కూడా కోల్పోయాడని చెబుతున్నారు. అతడికి చికిత్స కొనసాగుతోంది.