అమరావతి : ఏపీలోని నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident ) జరిగింది . పొగ మంచు ( Fog ) కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు దుర్మరణం చెందారు. నంద్యాల జిల్లా డోన్ సమీపంలోని ఉడుములపాడు వద్ద ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న ముగ్గురు మంగళవారం తెల్లవారుజామున విధులు నిర్వహించేందుకు ఒకే ద్విచక్రవాహనంపై సొంత గ్రామం ప్యాపిలి మండలం ఎన్ రంగాపురం నుంచి బయలు దేరారు.
రహదారిపై మంచు కారణంగా ఎదురుగా వెళ్తున్న ఎండ్లబడి కనిపించకపోవడంతో ద్విచక్రవాహనంతో ఢీ కొన్నారు. ఈ ప్రమాదంలో ఘటన స్థలంలోనే కె. సురేంద్ర (26) అక్కడికక్కడే చనిపోగా మరో ఇద్దరిని డోన్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో రాజశేఖర్ఖ ( 24 ) మృతి చెందారు. వై. సురేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు వివరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.