అన్నమయ్య జిల్లా: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం రాత్రి పుల్లంపేట మండలంలోని రెడ్డిపల్లె చెరువుకట్టపై మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడింది. దీంతో 9 మంది కూలీలు మృతిచెందారు. మరో 13 మంది గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట ఎస్టీ కాలనీ, తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం వద్దవేడు, కల్వకుంట్ల ప్రాంతాలకు చెందిన 22 మంది కూలీలు రాజంపేట ఇసుకపల్లి గ్రామానికి మామిడి కాయల్ని కోసి, లారీలో లోడ్ చేసేందుకు వచ్చారు. మామిడి కాయల్ని లోడ్ చేసిన తర్వాత రైల్వే కోడూరు మార్కెట్ యార్డుకు వెళ్తున్న అదే లారీలో బయలుదేరారు. ఈ క్రమంలో రెడ్డిచెరువు కట్టపై మూల మలుపు వద్ద ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో కూలీలను పనికి తీసుకెళ్లిన మేస్త్రీ శివ ఒక్కరే చిన్న గాయాలతో బయటపడగా, అతని భార్య చిట్టెమ్మతోపాటు గజ్జల దుర్గయ్య, గజ్జల వెంకటేశు, గజ్జల శ్రీను, గజ్జల రమణ, గజ్జల లక్ష్మీదేవి, సుబ్బరత్నమ్మ, రాధ, వెంకట సుబ్బమ్మ ఘటనా స్థలంలోనే మృతిచెందారు. వద్దివేడు గ్రామానికి చెందిన మునిచంద్ర దవాఖానలో చికిత్స పొందుతూ మరణించారు. ఇక తీవ్రంగా గాయపడిన 13 మంది కూలీలు రాజంపేట ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.