Vijayawada | ఏపీలో రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు విజయవాడ నగరం తడిసిముద్దయింది. శనివారం రాత్రి నుంచి రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. 30 ఏండ్లలో ఎన్నడూ లేనంతగా ఒక్కరోజే 29 సెం.మీ. వర్షపాతం పడింది. భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమైపోయాయి. సింగ్‌నగర్, పైపుల రోడ్డు, సుందరయ్య నగర్, కండ్రిగ, రాజీవ్‌నగర్ తదితర ప్రాంతాలన్నీ వరద నీటితో నిండిపోయాయి. ఆటో నగర్ నుంచి బెంజి సర్కిల్ వరకు, విజయవాడ శివారు కండ్రిగ దగ్గర రహదారిపై భారీగా వరద ప్రవహిస్తోంది. దీంతో విజయవాడ, నూజివీడు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జలమయమయ్యాయి.
భారీ వర్షాలకు ఇంద్రకీలాద్రి దగ్గర కొండచరియలు విరిగిపడుతున్నాయి. బండరాళ్లు పడుతుండటంతో ఎన్‌హెచ్16 రహదారిని మూసివేశారు. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం లంకపల్లిలో బుడమేరు వాగు ఉప్పొంగింది. వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో పలు కాలనీల్లో 5 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. దీంతో ఆహారం, మంచి నీళ్లు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు.
కాగా, విజయవాడలోని మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ఈ నేపథ్యంలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని మంత్రి నారాయణ ఆదివారం ఉదయం పరిశీలించారు. ప్రమాదంలో ఐదుగురు మృతి చెందడం బాధాకరమని మంత్రి నారాయణ విచారం వ్యక్తంచేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రమాదాల నివారణకు కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు.