Cyclone Montha | మొంథా తుపాన్ వల్ల జరిగిన ప్రాథమిక నష్టాన్ని ఏపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రాథమికంగా 249 మండలాలు, 48 మున్సిపాలిటీల్లో 18 లక్షల మందిపై తుపాన్ ప్రభావం ఉన్నట్లు తెలుస్తోంది. వరదల కారణంగా ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలతో తుపాన్ నష్టం అంచనా ప్రక్రియను అధికారులు కొనసాగిస్తున్నారు. కాగా, మొంథా తుపాన్ కారణంగా భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో వరి, ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పంట నష్టంపై అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. జిల్లాల్లో భారీగా పంటలు దెబ్బతిన్నాయని చెప్పుకొచ్చారు. 10 వేల హెక్టార్లలో వరిపంట దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. 5 వేల హెక్టార్లలో ఉద్యానవన పంటలకు నష్టం కలిగినట్లు గుర్తించారు. రెండు వేల ఎకరాల్లో రొయ్యల చెరువులు నీట మునిగాయని అధికారులు తెలిపారు. కాగా, రెండు రోజుల్లో ఈ ప్రాథమిక నివేదికను పూర్తి చేసి ఏపీ ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. ప్రాథమిక అంచనాలు వచ్చాక కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించనుంది.