Agriculture | గాంధారి/రాజంపేట్ : తెలంగాణ సాగు భూముల్లో పోషకాలకు కొదువ లేదు. ప్రస్తుతం యాసంగి సీజన్ ముగుస్తున్నది. పంట భూములన్నీ ఖాళీగా ఉంటాయి. భూసారం పెరిగేలా చర్యలు చేపట్టేందుకు ఇదే సరైన సమయం. వేసవి దుక్కులు, భూసార పరీక్షలు చేయించుకొని, వానకాలం పంటకు సిద్ధంగా ఉండాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. దీంతో వచ్చే పంటలో తెగుళ్లు, కలుపు నివారణకు ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. వేసవి దుక్కులతో రైతులకు దక్కే లాభాలను వివరిస్తున్నారు.
ఏ పంట వేయాలన్నా ముందుగా దుక్కి దున్నాల్సిందే.. విత్తడానికి, నాటడానికి అనుకూలంగా పొలాన్ని సిద్ధం చేసుకోవాల్సిందే. దుక్కి చేయకుండా వదిలేయడంతో భూమి సత్తువ కోల్పోతుంది. చీడపీడలకు ఆవాసంగా మారుతుంది. ముడి పోషకాలలోపం ఏర్పడి, తర్వాతి పంటకు భారీగా ఎరువులు వేయాల్సి వస్తుంది. వీటన్నింటి నివారణ కోసం వేసవిలో లోతు దుక్కుల మీద రైతులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది.
చీడపీడలు, కలుపు నివారణకు చెక్…
ఎండకాలం చాలా వరకు భూమి ఖాళీగానే ఉంటుంది. ఈ సమయంలో గత పంటలను ఆశించిన అనేక రకాల పురుగులు వాటి నిద్రావస్థ దశలను నేల, చెత్త, చెదారం, కొయ్యకాడల్లో గడుపుతాయి. తెగుళ్లను కలుగజేసే శిలీంధ్రాలు భూమి లోపలి పొరల్లో ఆశ్రయం పొందుతాయి. వీటి శిలీంధ్ర బీజాలు భూమిలో నిల్వ ఉంటాయి. వేసవి దుక్కులతో నిద్రావస్థ దశలో ఉన్న చీడ పురుగుల కోశాలు, గుడ్లు, లార్వాలు బయటపడతాయి. వాటిని పక్షులు, కొంగలు, ఇతర పక్షులు తిని నాశనం చేస్తాయి. లోతుగా దున్నడంతో భూమి లోపలి పొరల్లో ఉన్న శిలీంధ్ర బీజాలు మట్టితోపాటు నేలపైకి వస్తాయి. బయటి అధిక ఉష్ణోగ్రతలకు చనిపోతాయి. ఇలా వేసవి దుక్కులతో రాబోయే పంటలను ఆశించి చీడపీడలకు చెక్ పెట్టవచ్చు. అదేవిధంగా వేసవిలో భూములను వదిలేస్తే కలుపు మొక్కలు విపరీతంగా పెరుగుతాయి. రాబోయే పంట సమయంలో కలుపు నివారణ కష్టతరమవుతుంది. పంట లేని సమయంలో పెరిగే కలుపు మొక్కలు భూమిలోని నీరు, పోషకాలను ప్రత్యక్షంగా గ్రహిస్తాయి. ఫలితంగా వచ్చే పంట దిగుబడి తగ్గుతుంది. వేసవి లోతు దుక్కులతో పాతుకుపోయిన కలుపు మొక్కలు, వాటి విత్తనాలను సమూలంగా నిర్మూలించవచ్చు.
మూడు రకాలుగా దున్నుకోవాలి..
వేసవి దుక్కులను లోతుగా, వాలుకు, అడ్డంగా దున్నుకోవాలి. వాలుకు అడ్డంగా దున్నుకోవడంతో వాననీరు భూమిలోకి ఇంకేందుకు అనుకూల పరిస్థితి ఏర్పడుతుంది. భూమి కూడా ఎక్కువ తేమను గ్రహిస్తుంది. నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. వేసవి దుక్కులకు ముందు పొలంలో గొర్రెలు, పశువుల మందలు తోలడంతో వాటి విసర్జక వ్యర్థాలు సేంద్రియ ఎరువుగా మారి భూమిలోకి చేరుతాయి. భూసార వృద్ధికి తోడ్పడుతాయి. గత పంటకు సంబంధించిన ఆకులు, మొదళ్లు, చెత్తాచెదారం నేల పొరల్లో కలిసిపోయి, ఎరువుగా మారుతాయి. రాబోయే పంటకు కావాల్సిన పోషక పదార్థాలను అందిస్తాయి.
Agriculture Farmers
అధిక దిగుబడులకు ఆస్కారం..
వేసవిలో లోతు దుక్కులు దున్నడం ద్వారా భూమిలోపల ఉన్న హానికర పురుగులు, శిలీంధ్రాలు నశిస్తాయి. వర్షపు నీరు భూమిలోకి ఎక్కువగా ఇంకుతుంది. భూమి పొరల్లో తేమ పెరుగుతుంది. ఆ తర్వాత వేసే పంట వేరు వ్యవస్థ లోపలి పొరల్లోకి చొచ్చుకెళ్తుంది. దీంతో పైరుకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వర్షాలకు ముందే భూమిని దున్నడంతో తొలకరి వర్షపు నీరు భూమిలోకి ఇంకుతుంది. భూమి కోతను నివారిస్తుంది. లోతు దుక్కులతో భూమి పైపొరలు కిందికి, కింది పొరలు పైకి తిరగబడి, నేల సారవంతంగా తయారవుతుంది. భూమిలోని తేమశాతం పెరిగి, భూసారం అభివృద్ధి చెందుతుంది. వేసవి దుక్కులకు ముందు పొలంలో పశువుల పెంట, కంపోస్టు ఎరువులు, చెరువులు, కుంటల్లోని మట్టిని వెదజల్లడం ద్వారా భూసారం మరింత పెరుగుతుంది. రాబోయే పంటల్లో అధిక దిగుబడులకు ఆస్కారం ఉంటుంది.
లోతు దుక్కులు అవసరమే…
యాసంగి కోతల తర్వాత చాలా మంది రైతులు భూమిని అలాగే వదిలేస్తారు. దీంతో ఖాళీ భూముల్లో కలుపు మొక్కలు, ఇతర గడ్డిజాతి మొక్కలు పెరుగుతాయి. ఇవి భూమిలోని నీటిని, పోషక పదార్థాలను గ్రహిస్తాయి. భూమికి సత్తువ లేకుండా చేసి భూసారాన్ని తగ్గిస్తాయి. భూమి లోపలి పొరల్లోని నీరు ఆవిరైపోతుంది. వేసవి దుక్కులు లేకుంటే తొలకరి వాననీరు భూమిలోకి ఇంకకుండా పోతుంది. వర్షాలతో భూమి కోతకు గురవుతుంది. ఖాళీ భూముల్లో చీడపీడలు భారీగా వృద్ధి చెందుతాయి. ఫలితంగా పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది.
భూసార పరీక్షలకు సరైన సమయం..
వేసవి దుక్కులతోపాటు భూసార పరీక్షలు చేయించుకోవడానికి ఇదే సరైన సమయం. ప్రస్తుతం రసాయన ఎరువుల వాడకంతో నేల నిస్సారంగా మారిపోతున్నది. ఈ క్రమంలో భూసార పరీక్షలు చేయిస్తే మట్టిలో లోటుపాట్లు, ఆమ్ల, క్షార గుణాలు తెలుస్తాయి. దీంతో వానకాలంలో ఏ పంటలు సాగు చేయాలో, ఆయా పంటలకు ఎలాంటి ఎరువులు ఎంత మోతాదులో వినియోగించాలో తెలుస్తుంది. దీంతో అనవసర ఎరువుల వినియోగం తగ్గడంతోపాటు సాగు ఖర్చులు తగ్గుతాయి.
వేసవి దుక్కులతో రైతుకు మేలు
వానకాలం, యాసంగి సీజన్లలో పంటలు కోసిన తర్వాత తప్పనిసరిగా పొలాన్ని దున్నాలి. పంటలకు హాని కలిగించే పురుగులు నాశనమవుతాయి. దుక్కులు దున్నే ముందు పశువుల పెంట, కంపోస్టు ఎరువులు, చెరువులోని పూడిక మట్టిని వేయడంతో అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. రైతులు తప్పనిసరిగా వేసవి దుక్కులు చేపట్టాలి.
-ఎం.శిల్ప, ఏఈవో, ఆర్గొండ
భూమిలోని శిలీంధ్రాలు నశిస్తాయి..
ఎండకాలంలో భూములను లోతుగా దున్నుకోవడంతో భూమిపొరల్లో దాగి ఉండి పంటకు నష్టం కలిగించే కీటకాలకు సంబంధించిన శిలీంధ్రాలు, లార్వాలు చనిపోతాయి. దీంతో పంటలకు నష్టం కలిగించే కీటకాల ఉధృతి తగ్గుతుంది. పంటకు సంబంధించిన వేరు వ్యవస్థ బలంగా ఉంటుంది.
– నరేశ్, వ్యవసాయాధికారి, గాంధారి