e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home వ్యవసాయం మత్స్య సిరులు

మత్స్య సిరులు

  • చేపల పెంపకంతో అధిక లాభాలు
  • ఒకసారి పెట్టుబడితో దీర్ఘకాలిక రాబడులు
  • ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న రైతులు

ఒకప్పుడు ‘చేపల చెరువు’ అంటే ఉభయ గోదావరి జిల్లాలే గుర్తుకొచ్చేవి. ‘చేపల చెరువు’ అనే పదమే తెలంగాణకు కొత్తగా అనిపించేది. కానీ, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్‌ చొరవతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ‘వాటర్‌ హబ్‌’గా అవతరించిన తెలంగాణలోనూ ‘చేపల చెరువు’లు మంచి ఆదాయం అందిస్తున్నాయి. ఒకసారి పెట్టుబడితో దీర్ఘకాలిక దిగుబడులు అందిస్తూ, రైతన్న ఇంట సిరులు కురిపిస్తున్నాయి.

పెరుగుతున్న పెట్టుబడులతో సంప్రదాయ వ్యవసాయం భారంగా మారింది. కూలీల కొరతకూడా అన్నదాతను పట్టి పీడిస్తున్నది. దీనికి తోడు ప్రకృతి వైపరీత్యాలు రైతులను తీవ్రనష్టాల్లోకి నెడుతున్నాయి. ఈ నేపథ్యంలో అనేకమంది రైతులు ప్రత్యామ్నాయ మార్గాలవైపు మొగ్గు చూపుతున్నారు. డెయిరీ, కోళ్లు, మేకలు, గొర్రెల పెంపకాలవైపు అడుగులేస్తున్నారు. అయితే, రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా తెలంగాణలో చేపల పెంపకం లేదు. ఉన్నవికూడా సంప్రదాయ చెరువులు, రిజర్వాయర్లు మాత్రమే. దీన్ని గుర్తించిన పలువురు రైతులు, సంప్రదాయ వ్యవసాయాన్ని పక్కనపెట్టి చేపల పెంపకాన్ని చేపడుతున్నారు. ముఖ్యంగా కొరమేను (బొమ్మె) చేపలతో అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం యల్లగిరి గ్రామానికి చెందిన పలువురు రైతులు 10 గుంటల విస్తీర్ణంలో చెరువులను తవ్వించి కొరమేను చేపలను పెంచుతున్నారు.

క్రమంగా విస్తరణ

- Advertisement -

తెలంగాణలో చేపల పెంపకం క్రమంగా విస్తరిస్తున్నది. ఇంతకుముందు వరకూ సహజ సిద్ధమైన చెరువులు, రిజర్వాయర్లలోనే చేపలు దొరికేవి. కానీ, మారెట్‌లో ఉన్న డిమాండ్‌ దృష్ట్యా తెలంగాణలోనూ చేపల చెరువుల అవసరం ఏర్పడుతున్నది. అంతేకాకుండా, ఏటా చేపల వినియోగం పెరగడం, ధరకూడా ఆశాజనకంగా ఉండటంతో ఈ పరిశ్రమ రైతులకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తున్నది. దీనిని దృష్టిలో పెట్టుకొని కొందరు రైతులు కృత్రిమంగా చెరువులను తవ్వించి, చేపలను పెంచుతున్నారు. ఒక్కసారి పెట్టుబడి పెట్టి, తకువ కాలంలోనే అధిక దిగుబడులు సాధిస్తున్నారు. అయితే, ఇందులోనూ తెల్లచేప (రవ్వులు, బొచ్చెలు)ల పెంపకం కంటే, నల్లచేప (కొరమేను) పెంపకంలో లాభాలు అధికంగా ఉంటున్నాయి.

ఆసక్తి ఉంటే సత్ఫలితాలు

ఏ పని చేసినా ఆసక్తితోపాటు పట్టుదల తోడైతే సత్ఫలితాలు సొంతమవుతాయని నిరూపిస్తున్నాడు రైతు దేవేందర్‌ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పట్టణానికి చెందిన దేవేందర్‌ రెడ్డి 10 ఏండ్లు ఎలక్ట్రీషియన్‌గా పనిచేశాడు. ఇందుకోసం ప్రతిరోజూ హైదరాబాద్‌ నగరానికి రాకపోకలు సాగించేవాడు. దీంతో ఇబ్బందిపడ్డ దేవేందర్‌ రెడ్డి ఇంటి వద్దే ఉంటూ వ్యవసాయం చేయాలనుకొన్నాడు. తనకున్న మూడెకరాల భూమిలో, రెండెకరాల్లో వరిసాగుతోపాటు మరో ఎకరంలో కోళ్లఫాం ఏర్పాటు చేశాడు. అయితే, ప్రకృతి వైపరీత్యాలతో నష్టాలను చవిచూశాడు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఓ రైతు కొరమేను చేపల పెంపకాన్ని చేపట్టాడు. అది చూసి తానుకూడా రంగంలోకి దిగాలనుకొన్నాడు. 10 గుంటల్లో చెరువును తవ్వించి, చేపపిల్లలను పెంచుతున్నాడు. చేపలకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తుండటంతో ప్రస్తుతం ఒక్కో చేపా ముప్పావు కిలోనుంచి కిలోవరకు బరువు పెరిగాయి. మరో 15 నుంచి 20 రోజుల్లో చేపలు చేతికొస్తాయని రైతు చెబుతున్నాడు. అంతేకాకుండా స్వయంగా చేపపిల్లల ఉత్పత్తిని కూడా చేపడుతున్నాడు. ఇందుకోసం చెరువులోనే కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేశాడు. చేపల చెరువుకోసం దేవేందర్‌ రెడ్డి రూ.6 లక్షల 50 వేలదాకా పెట్టుబడి పెట్టాడు. ప్రస్తుతం ఈయన పెంచుతున్న కొరమేను చేపల విషయంలో మూడు టన్నులదాకా దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది. మార్కెటింగ్‌ కోసం ఇప్పటికే హోల్‌సేల్‌ వ్యాపారులతో కిలో రూ.350 చొప్పున మాట్లాడుకొన్నాడు. రూ.10 లక్షలదాకా ఆదాయం లభించనున్నది. పెట్టుబడి ఖర్చులు పోగా, దాదాపు రూ.3 లక్షల 50 వేలు నికర ఆదాయం పొందనున్నాడు. తదుపరి పంటకు చాలా ఖర్చులు ఉండవు కాబట్టి, పెట్టుబడి తగ్గి, నికర లాభాలు భారీగా పెరిగే అవకాశం ఉన్నది.

విదేశాల నుంచి వచ్చి..

మాది యాదాద్రి భువనగిరి జిల్లా యల్లగిరి. కొన్నేండ్లపాటు విదేశాల్లో ఉద్యోగం చేశా. కరోనా ప్రభావంతో స్వదేశానికి తిరిగొచ్చి కొరమేను చేపల పెంపకంలోకి దిగా. నాకున్న కొద్దిపాటి నేలను సద్వినియోగం చేసుకొంటూ, అతి తకువ ఖర్చుతో చేపలను పెంచుతున్నా. రైతు ఓపికనుబట్టి ఏడాదంతా చేపలను పెంచుకోవచ్చు. నిరంతరం ఆదాయం పొందవచ్చు. నేను రూ.1.50 లక్షలతో 10 గుంటల్లో చెరువు తవ్వించా. ఒకో కొరమేను పిల్లనూ రూ.10 పెట్టి కొనుగోలు చేశా. మొత్తం 8,500 పిల్లలు పెంచుతున్నా. మరో ఏడు నెలల్లో దిగుబడి చేతికి రానున్నది. కిలో రూ.300లకు అమ్మినా, రూ.9 లక్షల ఆదాయం వస్తుంది.

మేకల సందీప్‌రెడ్డి, రైతు

తక్కువ విస్తీర్ణంలోనే..

సంప్రదాయ పంటలు సాగు చేసి తీవ్రంగా నష్టపోయా. అందుకే తకువ విస్తీర్ణంలో, తకువ శ్రమతో అధిక లాభాలు అందించే చేపల పెంపకంలోకి అడుగుపెట్టా. 100 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పుతో చేపల చెరువును తవ్వించా. సహజసిద్ధమైన పద్ధతుల్లో చేపలను పెంచుతున్నా. తొమ్మిది నెలలకు ఒక పంట తీస్తున్నాం. కిలో రూ.350 నుంచి రూ.400 వరకూ పలుకుతున్నది. చేపలు నిర్ణీత సమయంలో మారెట్‌ సైజుకు రావాలంటే నాణ్యతతో కూడిన ఆహారం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే, దాణా కోసం తవుడు, బెల్లం వాడుతూ చెరువులోనే సహజ నాచు పెరిగేలా చర్యలు తీసుకొంటున్నాం.

పొనుగోటి కన్నారావు, రైతు

మజ్జిగపు శ్రీనివాస్‌రెడ్డి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana