కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 7(నమస్తే తెలంగాణ)/రెబ్బెన : పల్లె ప్రగతి ద్వారా ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాలను సంపూర్ణంగా నిర్వహించడంతో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని గోలేటి గ్రామం ఆదర్శ గ్రామంగా నిలుస్తున్నది. పల్లె ప్రగతిలో భాగంగా ప్రకృతివనం, శ్మశానవాటిక, డంప్‌యార్డు, సెగ్రిగేషన్ షెడ్లు నిర్మించడంతోపాటు అన్ని వీధుల్లో విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు.గల్లీ గల్లీకి సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించారు. సుమరు కోటి రూపాయలతో గ్రామ పంచాయతీలో అప్రోచ్, అంతర్గత రహదారులతోపాటు శ్మశానవాటిక, సెగ్రిగేషన్ షెడ్డు, పల్లె ప్రకృతివనం, డంప్ యార్డులను పూర్తిస్థాయిలో నిర్మించారు. వీటికిపాటు ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా మంచినీరు నల్లాలు ఏర్పాటు చేయడం ఏర్పాటు చేయడంతో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు అందుతున్నది. గత పల్లె ప్రగతిలో విద్యుత్ సమస్యలను గుర్తించి పరిష్కరించారు. విరిగిన విద్యుత్ స్తంభాలు తొలగించి వాటి స్థానంలో కొత్త స్తంభాలు ఏర్పాటు చేయడంతోపాటు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు బిగించారు.
చెత్త వేస్తే జరిమానా..
గోలేటి పంచాయతీకి ట్రాక్టర్ సమకూరడంతో పంచాయతీ సిబ్బంది చెత్త ఎప్పటికప్పుడు తొలగించి, డంప్ యార్డుకు తరలించడం వల్ల పారిశుధ్య సమస్య శాశ్వతంగా తీరింది. రహదారులు, కాలనీలు అద్దంలాగా మారిపోయాయి. గోలేటి, సోనాపూర్లలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతివనాలలో రకరకాల మొక్కలు పెంచుతుండడంతో గ్రామం కొత్త అందాలను సంతరించుకుంది. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. డంప్ యార్డు నుంచి చెత్త వేరు చేసి సెగ్రిగేషన్ షెడ్డు వద్ద సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో రోడ్లపై చెత్త వేసిన, ప్లాస్టిక్ వినియోగించిన వారికి జరిమానాలు విధిస్తున్నారు. స్వచ్ఛ తెలంగాణలో భాగంగా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించారు.
ఉత్తమ జీపీగా ఎంపిక వడమే లక్ష్యం
గోలేటి గ్రామ పంచాయతి(జీపీ)ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నాం. ఉత్తమ జీపీగా ఎంపిక కావడమే మా ముందున్న లక్ష్యం. తెలంగాణ సర్కారు మంజూరు చేస్తున్న నిధులతోపాటు, పల్లెప్రగతి నిధులతో అభివృద్ధి పనులు పూర్తి చేస్తాం. సమస్యలు లేకుండా ఉండడానికి శాయశక్తులా కృషి చేస్తున్నాం. గ్రామాభివృద్ధిలో ప్రజల సహకారం పూర్తిగా అందుతున్నది.
పల్లె ప్రగతి పనులు పూర్తి చేశాం..
తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న పల్లె ప్రగతిలో అభివృద్ధి పనులు సకాలంలో పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో ప్రతిరోజూ పర్యటిస్తూ పనులు తొందరగా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. నాతోపాటు కింది స్థాయి సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పల్లె ప్రగతి పనులు దాదాపు పూర్తయ్యాయి. మిగతా గ్రామాల్లో కూడా త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం.