కుభీర్ : కుభీర్ మండలం పార్డి (కె) రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road accident ) ఓ యువకుడు మృతి చెందాడు. హెచ్ పీ పెట్రోల్ బంక్ సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడు మహోర్ శీను ( 30) అడవి పందులు ( Wild Boars) అడ్డం రావడంతో వాటిని తప్పించబోయి బైక్ అదుపుతప్పి తుమ్మ చెట్టుకు ఢీకొన్నాడు. దీంతో అతడు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడని కుభీర్ ఎస్సై కృష్ణారెడ్డి ( SI Krishna Reddy ) తెలిపారు.
బుధవారం సాయంత్రం పార్డిలోని తన ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరి కుభీర్కు వెళ్లి పనులను ముగించుకొని రాత్రి 9 గంటల ప్రాంతంలో స్వగ్రామానికి తిరిగి వస్తుందడగా ఈ ఘటన చోటు చేసుకుంది. గురువారం కుబీర్ సంతకు వెళ్తున్న పలువురు గమనించి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించడంతో రూరల్ సీఐ నైలు నాయక్, ఎస్సై కృష్ణారెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించారు. పంచనామా నిర్వహించి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.