నిర్మల్ అర్బన్/బోథ్/తలమడుగు/భీంపూర్, ఫిబ్రవరి 24 : నారీశక్తి.. మగవారితో సమానంగా ప్రస్తుతం అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. మేం ఇంటికే పరిమితం కాదు.. శాంతిభద్రతల పరిరక్షణలోనూ అపరకాళీమాతల్లా కదులుతామని నిరూపిస్తున్నారు. సాయుధ బలగాల్లోనే కాదు.. నింగిలోకి రయ్యిమని దూసుకెళ్లే యుద్ధవిమానాలను నడుపుతూ ఔరా అనిపిస్తున్నారు. నింగీనేలా మాదే అంటూ దూసుకెళ్తున్నారు. అయ్యో ఆడపిల్ల పుట్టిందా.. అని మొదలయ్యి.. గడప దాటొద్దు లాంటి మాటలతో పంజరంలో చిలకలా ఎదిగి.. ఇంటి భారాన్ని నెత్తిన మోసే మహిళగా స్త్రీ ఓ పెద్ద సహనశీలి.. అలాంటి అతివలు ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం అనే నినాదాన్ని అందిపుచ్చుకొని ఎక్కడైనా తారాజువ్వలా దూసుకుపోగలమని నిరూపిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ ఒక లక్ష్యం ఉంటుంది. దాన్ని సాధించేదాకా నిద్రపోరు. ఈ లక్ష్యం చేరుకోవడంలో వారికి కొందరు స్ఫూర్తినిస్తారు. మరికొందరు చేయూతనిస్తారు. ఇంకొందరు భరోసానిస్తారు. వీరంతా ఆకాశమంతా లక్ష్యాన్ని చేరుకున్నవాళ్లే.. ఎందరికో ఆదర్శంగా నిలిచి, రేపటి అవని ప్రపంచానికి రోల్‌మోడల్స్‌గా మారినవాళ్లే..
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో శాంతి భద్రతల పరిరక్షణలో మహిళా ఎస్‌ఐలూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇ టీవల ఈ రెండు జిల్లాల్లో పదిమందికిపైగానే యువ మ హిళా ఎస్ఐలు ఆయా స్టేషన్ల పరిధిలో బాధ్యతలు స్వీకరించారు. విధుల్లో తమ ప్రత్యేకతను చాటుతున్నారు. స్వరాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల కోసం పోలీస్ శాఖ కొలువులకు నోటిఫికేషన్ వేయడం ద్వారా తమలో ఎందరికో ఉద్యోగాలు వచ్చాయని చెబుతున్నారు. ఈ రెండు జిల్లాల్లో బాధ్యతలు స్వీకరించిన యువ మహిళా ఎస్ఐలపై నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం..
మాది కరీంనగర్ జిల్లా సైదాపుర్ మండలం. అమ్మానాన్న ఇద్దరూ వ్యవసాయం చేస్తుంటారు. ఇంట్లో ముగ్గురం ఆడపిల్లలమే. అందుకే మమ్మల్ని ఎంతో బాగా చదివించారు. 2017లో బీటెక్ పూర్తి చేశాను. మొదటగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) ఉద్యోగం రాగా, ఆ తర్వాత కానిస్టేబుల్, మూడో సారికి ఎస్ఐగా ఉద్యోగం వచ్చింది. వీటన్నింటిలో ఎస్ఐ పోస్టు మంచిదని చేరాను. 2019లో పోస్టింగ్ వచ్చింది. 2020 లో వరంగల్ సుబేదారిలో ఉద్యోగంలో చేరా. అక్కడి నుంచి జోనల్ బదిలీల్లో భాగంగా నిర్మల్ జిల్లాకు వచ్చాను. పోలీస్ శాఖలో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. గ్రూప్ వన్ ఆఫీసర్ కావాలని ఉంది. ప్రస్తుతం మూఢనమ్మకాలు, సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నా. ఉద్యోగం చేస్తూనే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నా. యువత ఒక లక్ష్యంతో ముందుకు సాగాలి. వ్యసనాలు, నేరాలకు దూరంగా ఉండాలి. – పోగుల సుమాంజలి, కుంటాల ఎస్ఐ
మాది మహబూబబాద్ జిల్లా కేసముద్రం. 2020 బ్యాచ్‌లో ఎస్ఐగా వరంగల్ జిల్లా ఆత్మకూరులో ఉద్యోగంలో చేరాను. అమ్మానాన్నలు వ్యవసాయం చేస్తూ మమల్ని చదివించారు. బ్యాంకింగ్ ఉద్యోగం కోసం ప్రిపేరవుతున్న సమయంలో పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. .మొదటి ప్రయత్నంలోనే ఎస్ఐగా ఉద్యోగం సాధించా. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే ట్రైనింగ్ పూర్తి చేసి విధుల్లో చేరాను. జోనల్ బదిలీల్లో బాసర అమ్మవారి క్షేత్రంలో మహిళా ఎస్ఐగా విధులు నిర్వర్తించడం చాలా సంతోషంగా ఉంది. శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయడమే నా విధి. మహిళలు, యువతులపై దాడులు జరిగినప్పుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెనకాడవద్దు.
– భూక్యా సుమలత, నిర్మల్ టౌన్ ఎస్ఐ
మాది నిర్మల్ పట్టణంలోని శాస్త్రీనగర్. అమ్మానాన్న బిట్ల విజయ, మల్లేశ్. ఇద్దరూ వ్యవసాయ కూలీలు. ఏకైక కూతురినైన నన్ను కష్టపడి చదివించారు. నిర్మల్లోఎస్ఎస్ఆర్ హైస్కూల్లో పదోతరగతి వరకు చదివా. దీక్షా జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివా. ఘట్కేసర్లోని వీబీఐటీలో బీటెక్, ఎంటెక్ పూర్తి చేశా. పోలీస్ ఉద్యోగం సాధించాలని పట్టుదలతో ముందుకు సాగా. ముందుగా ఎఫ్‌బీవోగా ఉద్యోగం సాధించా. కడెంలో కొన్నాళ్లు విధులు నిర్వర్తించా. అదే సమయంలో ఎస్ఐ ఉద్యోగానికి ప్రిపేరై, సాధించా. 2019-20 బ్యాచ్ ఎస్ఐగా ఎంపికయ్యా. ఎఫ్‌బీవోగా రిజైన్ చేసి ఎస్ఐగా బాధ్యతలు చేపట్టా. నెలరోజులపాటు గాదిగూడలో ప్రొబేషనరీ ఎస్ఐగా పని చేశా. ఎస్ఐగా మొదటి పోస్టింగ్ ఆదిలాబాద్ టూటౌన్లో బాధ్యతలు తీసుకున్నా. తదనంతరం 2021 డిసెంబర్లో జైనథ్ ఎస్ఐగా బాధ్యతలు తీసుకున్నా. ప్రస్తుతం శాంతిభద్రతల పరిరక్షణలో సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తూ అందరి మన్ననలు పొందుతున్నా.
– పెర్సిస్, జైనథ్ ఎస్ఐ
భీంపూర్, ఫిబ్రవరి 24: నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం వటోలి గ్రామం మాది. తల్లిదండ్రులు గంగవ్వ, భోజన్న. వ్యవసాయ కుటుంబం. ఒక సోదరుడు సాయికుమార్ రైల్వేశాఖ ఉద్యోగి. మరో సోదరుడు సురేందర్ వ్యాపారం చేస్తున్నాడు. నాకు బాల్యం నుంచి వ్యవసాయంతో పాటు గ్రామీణ వాతావరణంతో మంచి అనుబంధం ఉన్నది. మహిళలపై వివక్ష ,దాడుల లాంటి ఘటనల నేపథ్యంలో పోలీస్‌శాఖలో చేరాలనుకున్నాను. ఎస్ఐగా ఉద్యోగం సాధించాలనుకున్నాను. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో నా గమ్యానికి అడుగులేశాను. 2019-20 బ్యాచ్‌లో ఎస్ఐగా ఎంపికయ్యాను. ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్లో ప్రొబేషనరీ ఎస్ఐగా విధులు నిర్వర్తించాను. ఆ సమయంలో పోలీస్ బాధ్యతలు, ఫ్రెండ్లీ పోలీసింగ్ గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాను. ఆచరణలో పెట్టాను. ఆ తరువాత ఆదిలాబాద్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐగా విధులు నిర్వర్తించాను. మహిళలు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలపై పూర్తి అవగాహన వచ్చింది. బాధిత మహిళలకు అండగా ఉంటామని ధైర్యం చెప్పేవారం. ప్రస్తుతం భీంపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐగా బాధ్యతలు తీసుకున్న. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న మండలం కావడంతో పూర్తిగా అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. ఇప్పటివరకు ఉద్యోగంలో నేను ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు లేవు. ప్రతికూల పరిస్థితులు ఉన్నా ధైర్యంగా అధిగమిస్తాననే నమ్మకం ఉంది. అమ్మాయిలు మనోనిబ్బరంతో ముందడుగు వేస్తే, ఏరంగంలోనైనా రాణించే అవకాశం ఉంటుంది.
-రాధిక, భీంపూర్ ఎస్ఐ
బోథ్, ఫిబ్రవరి 24 : అమ్మాయినని ఏనాడూ నేను అధైర్య పడలేదు. కష్టపడి చదివి ఎస్ఐగా ఉద్యోగం సాధించా. మాది జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామం. నాన్న గణేశ్ బీడీ కమీషన్ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. అమ్మ లక్ష్మి గృహిణి. ఎంటెక్ విద్యాభ్యాసం చేసి మొదట పోలీసు కానిస్టేబుల్, ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యాను. అయినా పట్టుదలతో చదివి ఎస్ఐగా ఉద్యోగం సాధించా. ఉద్యోగ రీత్యా ఆడైనా మగైనా ఒక్కటే. ఏనాడూ అమ్మాయినని నిరుత్సాహ పడలేదు. పోలీస్ విధులు కూడా ఏనాడూ కష్టమనిపించలేదు. ఉన్నతాధికారుల ప్రోత్సాహం, పనిచేసిన చోట సిబ్బంది సహకారం, కుటుంబ సభ్యుల ఆశీస్సులతో రాణించగలుగుతున్నా. శాంతిభద్రతల పరిరక్షణకు శాయశక్తులా శ్రమిస్తున్నా. ఇక్కడి ప్రజలు కూడా సహకరిస్తున్నారు. – పీ దివ్యభారతి, బోథ్ ఎస్ఐ
మాది పెద్దపల్లి జిల్లా మంథని గ్రామం. పేద కుటుంబం. ఎమ్మెస్సీ,బీఈడీ పూర్తి చేశా. చిన్నప్పటి నుంచి పోలీస్ ఉద్యోగమంటే చాలా ఇష్టం. రానురానూ నా గోల్‌గా మారింది. ముందుగా 2011లో ప్రయత్నించి విఫలమయ్యా. అయినా వెనక్కి తగ్గలేదు. 2018లో ఉద్యోగం సాధించా. 2019లో ఎస్ఐగా ట్రైనింగ్ పూర్తి చేసి, 2020లో వరంగల్ జిల్లాలో తొలి పోస్టింగ్ తీసుకున్నా. ప్రస్తుతం నర్సాపూర్ జీ స్టేషన్ ఎస్ఐగా పనిచేస్తున్నా. ఇక్కడి మహిళల సమస్యలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టా. ప్రజలకు పలు అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేస్తా. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో అవసరం. యువత కూడా వ్యసనాలకు దూరంగా ఉండాలి. అనవసరంగా జీవితాన్ని నాశనం చేసుకోకుండా, ఉన్నత లక్ష్యంతో ముందుకెళ్లాలి.
– పాకాల గీత, నర్సాపూర్ జీ ఎస్ఐ
తాంసి, ఫిబ్రవరి 24 : మాది భైంసా పట్ణణం. నాన్న సుదర్శన్ పీజీ హెచ్ఎంగా రిటైర్డ్ అయ్యారు. అమ్మ రమాదేవి 25 ఏండ్లు భైంసాలోని ఓ ప్రైవేట్ స్కూల్లో హిందీ ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. ఒక్కగానొక్క కూతురిని కావడంతో గారాబంగా పెంచారు. పదో తరగతి వరకు భైంసాలోనే చదివా. ఇంటర్ తర్వాత ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించి బీటెక్‌లో జాయిన్ అయ్యా. ప్రభుత్వం ఎస్ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వేయగా, మొదటి ప్రయత్నంలోనే సాధించా. 2020లో ఎస్ఐగా ఎంపికయ్యా. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కే బాధితులకు న్యాయం జరిగేలా చూడడమే నా బాధ్యత. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే రూ. లక్షల్లో వేతనం వస్తుంది. నిత్యం కంప్యూటర్లతో పోటీపడాలి తప్పా, ఆత్మ సంతృప్తి ఉండదు. ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేయాలనే ఈ వృత్తిని ఎంచుకున్నా. అమ్మానాన్నల ప్రోత్సాహం వల్లే ధైర్యంగా ఎస్ఐగా రాణించగలుగుతున్నా. వారి పేరు నిలబట్టేందుకే ప్రతి నిమిషం ప్రయత్నిస్తా. ఉన్నతాధికారులు, సిబ్బంది సహాయ సహకారాలతో విధుల్లో విజయవంతంగా రాణిస్తున్నా.
– కుభీర్ ధనశ్రీ, తాంసి ఎస్ఐ