నిర్మల్, మార్చి 9(నమస్తే తెలంగాణ) : గడ్డెన్న వాగు ప్రాజెక్టు కింద యాసంగి సాగు ప్రశ్నార్థకంగా మారింది. పాలకుల పట్టింపు లేనితనం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆయకట్టు రైతులకు పూర్తిస్థాయిలో సాగు నీరు అందడం లేదు. భైంసా పట్టణ శివారులో నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా భైంసా, లోకేశ్వరం మండలాల్లోని దాదాపు 14 వేల ఎకరాలకు సాగు నీరు అందించాల్సి ఉన్నది. 2005 సంవత్సరంలోనే ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినప్పటికీ, కాలువల నిర్మాణం జరగకపోవడంతో ఆయా మండలాల్లోని భూములు ఏళ్లుగా సాగునీటికి నోచుకోలేదు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2017లో ఈ ప్రాజెక్టు కింద ప్రధాన కాలువ నిర్మాణానికి అప్పటి సీఎం కేసీఆర్ రూ.6 కోట్లు విడుదల చేశారు. దీంతో దాదాపు 20 కిలోమీటర్ల మేర కాలువ నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం భైంసా నుంచి పుస్పూర్, బిలోలి గ్రామాల వరకు కాలువ ద్వారా సాగు నీరు అందుతున్నది. మరో 8 కిలోమీటర్ల మేర కాలువ నిర్మాణ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందుకోసం గతేడాది కాలంగా నిధులు మంజూరు చేయాలని అధికారులు ప్రతిపాదనలు పంపినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం ఆ ప్రతిపాదనలను బుట్టదాఖలు చేసింది. దీంతో ఆయకట్టు రైతులకు పూర్తిస్థాయిలో సాగు నీరు అందడం లేదు.
గడ్డెన్న వాగు ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా రోజుకు కేవలం 80 క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేస్తుండడంతో కాలువ కింద సాగు చేస్తున్న పంటలకు నీరు సరిపోవడం లేదు. వాస్తవానికి ఈ కాలువ ద్వారా 14 వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా, ప్రస్తుతం ఎనిమిది వేల ఎకరాలకు కూడా సక్రమంగా అందడం లేదని రైతులు వాపోతున్నారు.
ముఖ్యంగా లోకేశ్వరం మండలంలోని పుస్పూర్ గ్రామానికి చెందిన చాలామంది రైతులు ఈ కాలువ నీటినే నమ్ముకుని యాసంగిలో వరి, మక్క సాగు చేశారు. అయితే అతి తక్కువ నీటిని వదులుతుండడంతో కనీసం తూముల మట్టం కూడా నీరు ప్రవహించడం లేదు. దీంతో ఎండిపోతున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చి మోటార్లను ఏర్పాటు చేసుకుని కాలువలో ఉన్న అరకొర నీటిని తోడుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కూడా అధికారులు అడ్డంకులు సృష్టిస్తుండడంతో పంటలు ఎండిపోతున్నాయి. రైతులు ఏర్పాటు చేసుకున్న మోటార్లను నీటిపారుదల శాఖ సిబ్బంది తొలగిస్తున్నారు.
అంతే కాకుండా విద్యుత్ వైర్లను కట్ చేసి తమను ఇబ్బందుల పాలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం నుంచి రైతుభరోసా సాయం అందకున్నా.. అప్పులు చేసి సాగు చేసిన పంటలు తమ కళ్ల ముందే ఎండుతుంటే రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఒకవైపు కరెంటు కోతలు, మరోవైపు సాగునీటి తిప్పలతో మళ్లీ ఉమ్మడి రాష్ట్ర పాలన రోజులు గుర్తుకు వస్తున్నాయని రైతులు చెబుతున్నారు. గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఇలాంటి కష్టాలు ఎన్నడూ చూడలేదని, ఈ కాంగ్రెస్ పాలనలో మళ్లీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయని పుస్పూర్‌కు చెందిన రైతులు పర్స పోతన్న, భూషన్రెడ్డిలు ‘నమస్తే’ ప్రతినిధితో వాపోయారు. ఒక చేతిలో కట్టె, మరో చేతిలో టార్చి లైట్ పట్టుకుని అర్ధరాత్రి తమ పొలాలకు నీళ్లు పారియతందుకు వెళ్తున్నామని, ఈ కష్టం పగోడికి కూడా రావొద్దని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
గడ్డెన్నవాగు ప్రాజెక్టు కాలువను నమ్ముకుని వరి వేస్తే రెండెకరాలు ఎండింది. నోటికి అచ్చిన పంట కండ్ల ముందే ఎండిపోతున్నది. నీళ్లు లేక రెండెకరాలు ఇడిసిపెట్టి, పొట్ట కోసం ఒక ఎకరం పొలాన్ని అయినా కాపాడుకుందామని నానా తంటాలు పడుతున్న. ఎకరానికి రూ.5 వేలు కిరాయి ఇచ్చి మోటరు తెచ్చుకుని నీళ్లు పారించుకుంటున్న. రోజుకు పది సార్లు కరెంటు బంద్ అయితున్నది. అర్ధరాత్రి ఒంటి గంటకు కరెంటు ఇస్తున్నరు. మళ్లీ పాతకాలం లెక్క రోజులు అచ్చినయ్. నీళ్ల కోసం పొలం కాడనే పడుకుంటున్న. నాకు పుస్పూర్ శివారంల ఉన్న మూడెకరాల పొలంల వరి వేసిన.
కెనాల్ కింద నీళ్లు అందకుంటే కాల్వ పొంట మోటర్లు పెట్టుకుని నీళ్లు పారించుకొమ్మని ఆఫీసర్లు చెప్పిన్రు. ఇప్పుడేమో నీళ్లు లేవని మోటర్లు పెట్టనిస్తలేరు. రాత్రి పూట అచ్చి బందు చేస్తున్నరు. కెనాల్ పొంటనే భూమి ఉన్నప్పటికీ నీళ్లు అందుతలేవు. కాలువల నీళ్లు జానెడు మట్టం కూడా అస్తలేవు. తూములు మీదికైనయ్. నీళ్లు కిందికి అయినయ్. కేసీఆర్ ఉన్నప్పుడు కాలువ ఫుల్లు పారుతుండే. పొలాలు పారంగా ఇంకా మిగిలిన నీళ్లతో చెరువుల నిండుతుండే. తూముల నుంచే పొలాలు పారుతుండే. ఇప్పుడు మోటర్లు పెట్టినా అందుతలేవు. ఈ గవర్నమెంట్ అచ్చిన సంది రైతులకు చాన తిప్పలైతున్నది. రుణమాఫీ బరాబర్ కాలే. రైతుబంధు రాలే. రైతుల బతుకు తువ్వాల అడ్డం పెట్టుకుని ఏడుసుడుకు అచ్చింది. ఇంత అందేర్ అయితదని అనుకోలే.
– పర్స పోతన్న, రైతు, పుస్పూర్, లోకేశ్వరం మండలం.
గడ్డెన్నవాగు ప్రాజెక్టు కింద మెయిన్ కెనాల్‌కు సరిగ్గా నీళ్లిస్తలేరు. ఉన్న కొన్ని నీళ్లను మోటార్లు పెట్టి పంటలను కాపాడుకుందామంటే అధికారులు సహకరిస్తలేరు. కాలువ మీద పని చేసెటోళ్లు అచ్చి మోటర్లు బంద్ చేస్తున్నరు. కరెంటు వైర్లు కట్ చేస్తున్నరు. కరెంటు కూడా సక్కగ ఉంటలేదు. ఎప్పుడు అస్తదో ఎప్పుడు పోతదో తెలుస్తలేదు. వరి, మక్క పంటలు ఎండిపోతున్నయ్. కాలువ పక్కనే నాకు భూమి ఉన్నది. మా కోసమే తూము ఉన్నప్పటికీ.. తూము లెవల్ కూడా నీళ్లు వదలడం లేదు.
మోటర్లు పెట్టి పారిద్దమంటే కాలువల కనీస మట్టం కూడా నీళ్లుంటలేవు. కాలువ మీదనే ఆధారపడి పంటలు ఏసినం. కేసీఆర్ హయాంలనే కాలువలు తవ్విండ్రు. నాలుగేండ్ల సంది ఏ ఇబ్బంది లేకుండే. ఈ సంవత్సరమే నీళ్లు లేక పంటలన్నీ ఎండిపోతున్నయ్. రెండెకరాల్లో వరి, రెండెకరాల్లో మక్క పంట వేసిన. వరి మొత్తం ఎండింది. ఎకరానికి 20 వేల చొప్పున పెట్టుబడి ఖర్చులైనయ్. రెండెకరాలకు 40 వేల పెట్టుబడి ఖర్చులు నష్టపోయిన. రైతులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి సాయం చేయడం లేదు. కనీసం ఎండిన పంటలను సర్వే చేసి నష్టపోయిన రైతులకు పరిహారాన్ని ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలి.
– కోనాజి భూషన్‌రెడ్డి, రైతు, పుస్పూర్, లోకేశ్వరం మండలం