ఇంద్రవెల్లి : మండలంలోని వడగాం గ్రామపంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాల్లో బెల్ట్ షాపులు ( Belt shops ) తొలగించాలని మహిళా సంఘాలు ( Womens Group ) తీర్మానం చేశాయి. గురువారం మండలంలోని వడగాం గ్రామంలో నిర్వహిస్తున్న బెల్ట్ షాపును మహిళా సంఘాల ఆధ్వర్యంలో బెల్ట్ షాపుల నిర్వహకులను హెచ్చరించి షాపులు బంద్ చేయించారు.
ఇక నుంచి వడగాం గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామాల్లో బెల్ట్ షాపు నిర్వహిస్తే మహిళా సంఘాల ఆధ్వర్యంలో దుకాణాలపై దాడులు నిర్వహించి ధ్వంసం చేసి రూ. 50 వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేస్తున్నారని మహిళలు ఆరోపించారు. దీంతో గ్రామీణ యువత మద్యానికి అలవాటు పడుతున్నారని ఆరోపించారు.
కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహజన్ దృష్టి సారించి గ్రామాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న మద్యం బెల్ట్ షాపులను తొలగించాలని కోరారు. మహిళా సంఘాల సభ్యులు ఆత్రం భీమ్ బాయి, విజయలక్ష్మి, సోన్ దేవి, కలబాయి, రత్తుబాయి, నీలబాయి, ఉమాబాయి, లక్మిబాయి, కౌసుబాయి, సీతాబాయి, దేవుబాయి, రూపాబాయి, లచ్చుబాయి, సోంబాయి తదితరులు పాల్గొన్నారు.