 
                                                            కోటపల్లి, అక్టోబర్ 29 : బస్సులు నిలుపడం లేదంటూ కోటపల్లి మండలం రాంపూర్ గ్రామ మహిళలు బుధవారం ఆందోళన బాట పట్టారు. మంత్రి వివేక్‌కు చెప్పినా తమ సమస్యకు పరిష్కారం చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. బస్టాప్ వద్ద ఎక్స్‌ప్రెస్ బస్సులు ఆపడం లేదని, జనాలు ఎక్కువగా ఉంటున్నారన్న సాకుతో ఆర్డీనరీ బస్సులు సైతం నిలుపడం లేదని మండిపడ్డారు. వీటికి తోడు పల్లెవెలుగు బోర్డుతో నడిచే బస్సులకు సైతం ఎక్స్‌ప్రెస్ బోర్డులు పెట్టి ఎక్కడో దూరంగా ఆపడం వల్ల విద్యార్థులతో పాటు గ్రామస్తులమంతా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
సమస్య పరిష్కారమయ్యే వరకూ ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. రెండు గంటల పాటు ఆందోళన చేపట్టడంతో ఇరువైపులా కిలో మీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న కోటపల్లి ఎస్ఐ రాజేందర్ ఘటనా స్థలానికి చేరుకొని మహిళలతో మాట్లాడారు. ఆర్టీసీ అధికారులతో ఫోన్ మాట్లాడించినా వారు శాంతించలేదు. బస్సులు తమ స్టాప్ వద్ద నిలుపుతామని ఆర్టీసీ అధికారుల నుంచి స్పష్టమైన హామీ వస్తేనే ఆందోళన విరమిస్తామని స్పష్టం చేశారు. మహిళలతో ఓపికగా మాట్లాడిన ఎస్ఐ.. సమస్యను ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.
మంత్రికి చెప్పినా బస్సు ఆగడం లేదు
రాంపూర్‌లో ఆర్టీసీ బస్సులు ఆపకపోవడం విమర్శలకు తావిస్తున్నది. కాంగ్రెస్ నాయకుడు బొడ్డు రవి తమ గ్రామ బస్టాప్ వద్ద బస్సులను ఆపడం లేదని, ఆర్డీనరీతో పాటు ఎ క్స్‌ప్రెస్ బస్సులను నిలిపేలా చర్యలు తీసుకోవాలని మంత్రి వివేక్‌కు ఇటీవల వినతి పత్రం సమర్పించారు. మంచిర్యాల ఆర్టీసీ డీఏంతో మా ట్లాడిన మంత్రి స మస్య పరిష్కరించాలని సూచించారు. ఈ విషయాన్ని ఆర్టీసీ డీఏం కు కూడా రవి వినతి పత్రం అందించారు. ఆర్డినరీ బస్సుల కు ఎక్స్‌ప్రెస్ బోర్డులను ఏర్పాటు చేయడం వల్ల సమస్య ఉత్పన్నమవుతుందని చెప్పినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పటికైనా రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ స్పందించి తమ బస్టాప్ వద్ద బస్సులు ఆగేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
 
                            