మంచిర్యాల, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సర్పంచ్ ఎన్నికలకు ఇక కొన్ని రోజులే మిగిలి ఉండగా, బరిలో నిలిచిన అభ్యర్థులంతా కాసుల వేటలో నిమగ్నమయ్యారు. ప్రధానంగా అధికార పార్టీ ఉన్నోళ్లకే పెద్దపీట వేసి, ఆది నుంచి కష్టపడ్డ వారికి మొండిచేయి చూపగా, వారంతా రెబల్స్‌గా మారి బరిలో నిలిచారు. కొందరు.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రి మద్దతు ఉందన్న ధీమాతో దూసుకుపోతుండగా, మరికొందరు డబ్బుల్లేక తర్జనభర్జన పడుతున్నారు. ఇక ఇటు ఆదిపత్య పోరు.. అటు తిరుగుబాటు దారులతో సతమతమవుతున్న ‘హస్తం’.. ఈ ఎన్నికల్లో గెలుపొందడం కష్టమేనని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలతో గ్రామాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా మొదటి విడుతలో ఎన్నికలు నిర్వహించనున్న గ్రామాల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగియనున్నది. యంత్రాంగం బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు పోటీలోనున్న అభ్యర్థుల జాబితాతో పాటు గుర్తులు కేటాయించనున్నది. ఈ నెల 11న ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నది. వచ్చే గురువారం ఎన్నికలుండడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ఖర్చులకు డబ్బులు జమ చేసుకునే పనుల్లో నిమగ్నమయ్యారు.
అనుకోకుండా రిజర్వేషన్ కలిసి వచ్చి బరిలో నిలిచిన అభ్యర్థులు ఎన్నికలకు పైసలు ఎక్కడికి నుంచి తీసుకురావాలన్న ఆందోళనలో ఉన్నారు. అధికార పార్టీ నుంచి సర్పంచులుగా పోటీ చేస్తున్న వారంతా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రి వివేక్‌పై గంపెడాశాలు పెట్టుకున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలున్న మంచిర్యాల, బెల్లంపల్లి, ఖానాపూర్ నియోజకవర్గాలతో పాటు మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూర్ నియోజకవర్గం నుంచి సర్పంచులుగా పోటీ చేస్తున్న నాయకులు.. ఆర్థిక తోడ్పాటు కోసం తమ ఎమ్మెల్యేలను కలుసుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. అధికార పార్టీ మద్దతు ఉందన్న ధీమాలోనూ కొందరు సర్పంచ్ అభ్యర్థులు దూసుకుపోతుంటే, ముందు నుంచి పార్టీ కోసం కష్టపడి ఇప్పుడు రిజర్వేషన్లు అనుకూలించి సర్పంచులుగా బరిలో నిలుస్తున్న కొందరు ఎన్నికల ఖర్చుల కోసం తర్జనభర్జన పడుతున్నారు.
ఇక అధికార పార్టీలో చాలా వరకు ఖర్చు పెట్టుకోగలిగిన సామర్థ్యం ఉన్న వారినే సర్పంచ్ అభ్యర్థులుగా ఖరారు చేయడంతో కొన్ని గ్రామాల్లో పార్టీ కోసం కష్టపడిన వారికి నిరాశే మిగిలింది. దీంతో ఆయా నాయకులు అధికార పార్టీ తీరుపై తీవ్రమైన అసహనంతో ఉన్నారు. ఇలా తాము నష్టపోయామన్న భావనలో ఉన్న నాయకులు రెబల్స్‌గా పోటీలో నిలబడేందుకు నామినేషన్లు వేశారు. మరికొందరేమో వేరే పార్టీలో చేరి నామినేషన్లు వేశారు. దీంతో ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి ఇబ్బందులు తప్పవనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీ గ్రూపు రాజకీయాలు, వర్గ విబేధాలతో సతమతమవుతున్నది. ముఖ్యంగా డీసీసీ పదవుల విషయంలో రాజుకున్న రాజకీయ వేడి ఆ పార్టీని అతలాకుతలం చేస్తున్నది. మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్యే పీఎస్ఆర్ వర్గానికి సంబంధించిన నాయకులను కాదని, మంత్రి వివేక్ అనుచరుడికి పదవి కట్టపెట్టడం జిల్లా పార్టీలో గందరగోళానికి దారి తీసింది. పార్టీ కోసం కష్టపడిన మా నాయకుడికి మంత్రి పదవి ఇవ్వకుండా అవమానించారని, చివరకు డీసీసీ పదవి కూడా మా వర్గానికి ఇవ్వలేదని పీఎస్ఆర్ అనుచరవర్గం, నాయకులు తీవ్రమైన అసహనంతో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఆ పార్టీ నాయకులు ఎంతమంది మనసుపెట్టి పని చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఇక బెల్లంపల్లిలో ఎమ్మెల్యే వినోద్ అసలు నియోజకవర్గాన్ని పట్టించుకునే పరిస్థితులే కనిపించడం లేదంటూ సొంత పార్టీ నాయకులే మండిపడుతున్నారు. సొంత పార్టీ నాయకులే ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఎమ్మెల్యే, పీఏల తీరుపై బహిరంగ విమర్శలు చేయడం నియోజకవర్గంలో హాట్‌టాపిక్‌గా మారింది. మొన్నటికి మొన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం రూ.3 లక్షలు వసూలు చేసేందుకు ప్రయత్నాలు జరగడం, ఆ పార్టీ నాయకులే ఈ వ్యవహారాన్ని బయటికి తేవడంతో రాష్ట్రవ్యాప్తంగా బెల్లంపల్లి వార్తల్లో నిలిచింది. ఆ పార్టీ నాయకులే ఎమ్మెల్యే మాట వినే పరిస్థితి లేదన్న చర్చ నడుస్తున్న తరుణంలో లోకల్ బాడీ ఎన్నికలు ఎమ్మెల్యే వినోద్‌కు సవాల్‌గా మారనున్నాయి. ఇక మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూర్‌లోనూ వర్గపోరు తారాస్థాయికి చేరింది.
కోటపల్లి మండలానికి చెందిని ఓ సీనియర్ లీడర్ ఆ మండలంలో మంత్రి వివేక్‌కు వ్యతిరేకంగా సత్తా చాటేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జుకు సొంత పార్టీలోని కొందరు కీలక లీడర్ల నుంచే వ్యతిరేకవర్గం ఉన్నది. స్థానిక ఎన్నికల్లో తమ కేడర్‌కు ప్రియార్టీ దక్కించుకునేందుకు ఆ నాయకులు ఎత్తులు వేస్తున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యేగా ఉన్న బొజ్జుకే నిర్మల్ జిల్లా డీసీసీ పగ్గాలు అప్పగించడం జిల్లాలోని సీనియర్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఒక పదవిలో ఉన్న నాయకుడికి మరో పదవి ఇవ్వబోమని చెప్పిన అధిష్ఠానం ఎమ్మెల్యేను ఎలా డీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తామరంటూ సొంత పార్టీ నాయకులే ప్రశ్నిస్తున్నారు. ఇక మిగిలిన నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలు, ఇటీవల పార్టీలోకి వచ్చిన నాయకుల మధ్య ఆధిపత్యపోరు నడుస్తున్నది. ఎవరికి వారు తమ కేడర్‌కు పార్టీ నుంచి మద్దతు కూడగట్టే పనుల్లో ఉండడంతో ఈ ఎన్నికలు అధికార కాంగ్రెస్‌కు అంత సులభం కాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలను అధికార పార్టీ ఎలా ఎదుర్కొంటుందన్నది ఆసక్తిగా మారింది.
జిల్లాలో అధికార పార్టీ పరిస్థితి ఇలా ఉంటే.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలన్న కృత నిశ్చయంతో ముందుకెళ్తున్నది. ఈ మేరకు అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సమీక్షలు నిర్వహిస్తున్నారు. రెం డేళ్ల ప్రభుత్వ పాలన వైఫల్యాలను ఎండగడుతూ జనాల్లోకి వెళ్లాలని, ఇదే సమయం లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అవతరణ, పదే ళ్ల పాలనలో బీఆర్ఎస్తో జరిగిన మేలును గ్రామస్థాయిలో ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం చేస్తున్నారు. ఇలా అధికార, ప్రతిపక్ష పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
అసలు పోటీనే లేకుండా ఏకగ్రీవంగా సర్పంచులను గెలిపించుకునేందుకు సైతం ఆయా పార్టీలు తీవ్రమై న ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవాలు సైతం అయిపోయా యి. ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే కొన్ని గ్రామాల్లో సర్పంచులు ఏకగ్రీవమయ్యారు. ఉట్నూర్ మండలంలో రెండు, సిరికొండలో ఆరు, గాదిగూడలో మూడు, ఇచ్చోడలో ఐ దు, ఇంద్రవెల్లిలో మూడు గ్రామాలతో పా టు 180 వార్డులు ఇప్పటికే ఏకగ్రీవయమ్యా యి. రేపటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుండటంతో ఇప్పటికే కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవాలకు ప్రయత్నాలు జరగుతున్నాయి. ఇలాంటి తరుణంలో మొదటి విడుత ఎ న్నికలు నిర్వహించే గ్రామా ల్లో బరిలో నిలిచే అభ్యర్థులు ఎవ్వరన్నది ఈ రోజుతో తేలిపోనున్నది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొలివిడుతలో ఎన్నికలు నిర్వహించే సర్పంచి, వార్డు మెంబర్ల స్థానాలకు దాఖలైన చెల్లుబాటు అయ్యే నామినేషన్లు
