మంచిర్యాల, మే 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండిసాయి భగీరథ్ తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఓ మైనర్ బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు నమోదైంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో బండి సంజయ్ కొడుకును కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవడంపై బీఆర్ఎస్ నాయకులు, మహిళా సంఘాల నేతలు మండిపడుతున్నారు. సామాన్యులకు ఒకలా, మంత్రి కొడుక్కు ఒకలా న్యాయం ఉంటుందా.. అంటూ నిలదీస్తున్నారు.
కేసు నమోదై నాలుగు రోజులైనా ఎందుకు అరెస్టు చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. బండి కుమారుడిని కాపాడేందుకు రేవంత్‌రెడ్డి పరోక్షంగా సహరిస్తున్నారని, బీజేపీ కాంగ్రెస్ రహస్య దోస్తాన్ను ఈ ఉదాంతం మరోసారి బట్టబయలు చేసిందంటున్నారు. పోక్సో కేసు నుంచి భగీరథ్‌ను తప్పించేందుకు సెక్షన్ 5-7 కింద కేసు పెట్టకుండా, కేసులో బెయిల్ వచ్చేలా సెక్షన్ 11కు మార్చారని ఆరోపించారు. బాధితురాలిని పోలీసులు బెదిరింపులకు గురిచేస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో.. పోలీస్ యంత్రాంగం, కాంగ్రెస్ సర్కార్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బండి కొడుకును కాపాడేందుకు కాంగ్రెస్ కంకణం కట్టుకుందంటూ బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు.
ఈ చీకటి దోస్తాన్ను తెలంగాణ సమాజం గుర్తించాలంటున్నారు. బాధితురాలికి న్యాయం జరిగే దాకా ఆమె తరుఫున బీఆర్ఎస్ పోరాడుతుందని, వెంటనే సంజయ్ కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకోవాలని, మహిళా పోలీస్ ఉన్నతాధికారులతో సిట్ ఏర్పాటు చేసి విచారించాలని డిమాండ్ చేశారు. బండి భగీరథ్‌కు లుక్ అవుట్ నోటీసులు ఇవ్వడంతో పాటు బాధితురాలి కుటుంబాన్ని బెదిరింపులకు గురి చేసిన బండి సంజయ్‌ని ఏ-2గా, సెటిల్మెంట్కు యత్నించిన ఓ జర్నలిస్టులను ఏ-3గా చేర్చాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గం ఇచ్చోడ, నిర్మల్, బైంసా, మంచిర్యాల, కాగజ్‌నగర్‌లో బండి భగీరథ్‌ను అరెస్టు చేయకపోవడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు తెలిపాయి. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడారు.
పేదోడికి ఒక న్యాయం.. పెద్దోడికి ఒక న్యాయమా?
లోకేశ్వరం, మే 11 : పేదోడికి ఒక న్యా యం..పెద్దోడికి ఒక న్యాయమా..? కేంద్రమంత్రి బండి సంజయ్ కొడుకుపై పోక్సో కే సు నమోదై 3 రోజులైనా పోలీసులు అరెస్టు చేయకపోవడం ఎంత వరకు సమంజసమని, కాంగ్రెస్, బీజేపీ మధ్య ఏమైనా లోపాయికారి ఒప్పందం ఉందా ? అని జడ్పీ మాజీ చైర్మన్ లోలం శ్యాంసుందర్ ప్రశ్నించారు. సోమవారం లోకేశ్వరంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇదే కేసు ఓ సామాన్యుడిపై నమోదైతే ప్రభుత్వం ఇలా కాపాడేదా ? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లోకేశ్వరం మండల బీఆర్ఎస్ కన్వీనర్ కరిపె శ్యాంసుందర్, ప్రశాంత్, అనిల్, సందీప్ ఉన్నారు.
చట్టానికి ఎవరూ చుట్టాలు కాదు
ముథోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు డాక్టర్ కిరణ్ కొమ్రేవార్
భైంసా, మే, 11 : చట్టానికి ఎవరూ చుట్టాలు కారనీ, కేంద్ర మంత్రి కుమారుడైనప్పటికీ నేరం చేస్తే శిక్షించాల్సిందేనని ముథోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు డాక్టర్ కిరణ్ కొమ్రేవార్ డిమాండ్ చేశారు. పోక్సో చట్టం కింద బండి సాయి భగీరథ్‌పై కేసు నమోదైనా అరెస్ట్ చేయడం లేదని, చట్ట ప్రకారం 24 గంటల్లో అరెస్ట్ చేయాలని నిబంధనలు ఉన్నా కూడా వాటిని అమలు చేయడం లేదని ఆరోపించారు. 72 గంటలైనా అరెస్ట్ చేయకపోవడంపై పోలీసుల తీరుపై అనుమానం కలుగుతుందన్నారు. కేసును ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున మంత్రి బండి సంజయ్‌ను పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తీవ్రమైన ఆందోళనలు, నిరసనలు చేపడుతామని హెచ్చరించారు.
భగీరథ్‌పై లుకౌట్ నోటీసులు జారీ చేయాలి
భైంసా, మే, 11 : బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై పోక్సో కేసు పెట్టి మూడు రోజులైనా అరెస్ట్ చేయకపోవడం బాధాకరమని ముథోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు విలాస్ గాదేవార్ అన్నారు. సోమవారం భైంసాలోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6 నెలలుగా మైనర్ బాలికపై అఘయిత్యాలకు పాల్పడుతూ ఆమె తల్లిదండ్రులకు బెదిరిస్తూ పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్నాడని ఆరోపించారు. భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్ తరఫున ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నిమ్మ సురేశ్, సుంకెట పోశెట్టి, సజన్, మహిపాల్, అజీజ్ ఖురేషి, రాజ్ కుమార్, అమీర్, తదితరులు ఉన్నారు.