మంచిర్యాల టౌన్, జూన్ 14 : సింగరేణి సంస్థను కాంగ్రెస్ పెద్దలు రాబందుల్లా పీక్కుతింటున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. మంచిర్యాలలో ఆదివారం మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డితో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శనివారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ ప్రాంతాన్ని సందర్శించిన సమయంలో బీఆర్ఎస్ పార్టీ, మాజీ మంత్రి హరీశ్‌రావు, టీబీజీకేఎస్‌పై ఇష్టారీతిన మాట్లాడారని, అవన్నీ అబద్దాలేని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై పనిచేస్తున్నాయని అనడం సిగ్గుచేటన్నారు. వాస్తవానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కుమ్మక్కై సింగరేణిని నాశనం చేస్తున్నాయని విమర్శించారు.
గతంలో బొగ్గుబ్లాకులు సింగరేణికే దక్కాలనే ఉద్దేశంతో టెండర్ ప్రక్రియ పూర్తయినప్పటికీ ఎవ్వరినీ పనిచేయనీయబోమని తేల్చిచెప్పిన నాయకుడు కేసీఆర్ అని గుర్తుచేశారు. డిప్యూటీ సీఎం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ సింగరేణిలో టెండర్లను పిలిచారని విమర్శించారు. సింగరేణిలో జరుగుతున్న అనేక కుంభకోణాలను కార్మిక క్షేత్రాలకు వచ్చి బయటపెడుతున్నందుకే మాజీ మంత్రి హరీశ్‌రావుపై విమర్శలు చేస్తున్నారని ఆయన తప్పుబట్టారు. నెలకు రెండుసార్లు మెడికల్ బోర్డును నిర్వహిస్తామని చెప్పి, రెండున్నరేండ్లయినా పెట్టకపోవడమేమిటని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ కార్మిక క్షేత్రంలోకి వస్తే ఆ భయానికే 335 మందికి నియామకపత్రాలు ఇచ్చారని, రెండేళ్లుగా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఈ పత్రాలు ఇచ్చేందుకు నలుగురైదుగురు మంత్రులు వచ్చారని, ఇదేదో ఘనకార్యమైనట్లు చెప్పుకుంటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో వేలాదిమందికి ఇచ్చామని, తాము ఏనాడూ ప్రగల్భాలకు పోలేదని గుర్తుచేశారు. మెడికల్ బోర్డు పెట్టకపోగా, గతంలో చేపట్టిన 13వేల పైచిలుకు నియామకాలపై విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తామని విక్రమార్క అనడం దారుణమన్నారు. ఇలా మాట్లాడిన ఆయనకు కార్మికుల ఎదుట నిలబడే అర్హత ఉందా అని ప్రశ్నించారు.
సైట్విజిట్ సర్టిఫికెట్ ఎందుకు పెట్టారో చెప్పాలని, బంధువులకు, అనునాయులకు, తమకు సంబంధించిన వారికి పనులు కట్టబెట్టేందుకే ఆ ఆప్షన్ పెట్టారని విమర్శించారు. సీఎం బావమరిది సృజన్‌రెడ్డికి చెందిన శోధ కన్స్ట్రక్షన్ 13 శాతం ఎక్సెస్ టెండర్ వేసిందని, ఆర్జీ ఓసీ-2లో 5 శాతం, ఎస్సార్పీఓసీ-2లో 8 శాతం, మణుగూరు ఓసీలో 10 శాతం, కేడీకే-3లో 8 శాతం ఎక్సెస్ టెండర్లు వేశారని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో 2023లో జరిగిన ఓసీ టెండర్లలో 22 శాతం లెస్ టెండర్లు పడ్డాయని గుర్తుచేశారు. రాజస్థాన్‌లోని జైసల్వేర్లో 1400 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ప్రపోస్ చేశారని, దానికి డీపీఆర్ గానీ, అక్కడి ప్రభుత్వంతో కొనుగోలు ఒప్పందం గానీ లేదని, పాకిస్తాన్ బార్డర్లో పనికిరాని స్థలం ఇస్తే పర్సెంటేజీలు ఇచ్చి కాంట్రాక్టర్లను బతికించేందుకే ఈ పనిచేశారని విమర్శించారు.
సింగరేణి లాభాల వాటాను 16 నుంచి 32 శాతం కార్మికులకు పంచిన ఘనత కేసీఆర్‌ది అని గుర్తుచేశారు. కానీ, ఈ ప్రభుత్వం 2023-24లో లాభా ల వాటా రూ.4,710 కోట్లు వస్తే 33 శాతం ప్రకటించి, రూ.2,289 కోట్లు పంచారని, ఇది మోసం కాదా అని ప్రశ్నించారు. 2024-25లో రూ.6,394 కోట్ల లాభాలు వస్తే 34 శాతం వాటా ఇస్తామని ప్రకటించి, కేవలం రూ.2,360 కోట్లు పంచారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఇంతకంటే అన్యా యం, అక్రమం ఎక్కడైనా ఉంటుందా అని అన్నారు. మెడికల్ ఇన్వ్యాలిడేషన్ అనేది కార్మికుల హక్కు అని భట్టి మాట్లాడటం విడ్డూరంగా ఉందని, మరి రెండున్నరేండ్లుగా ఏం చేశారని ప్రశ్నించారు. పెండింగ్‌లో ఉన్న మారుపేర్ల విషయంలో కమిటీ వేస్తామని అనడం సిగ్గుచేటన్నారు. మాయమాటలు చెప్పడం కాంగ్రెస్ నాయకులకు అలవాటేనని, కార్మికులకు అన్ని విషయాలూ తెలుసునని, తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
బకాయి విక్రమార్కగా పిలవాలి..
-నడిపెల్లి దివాకర్‌రావు
ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయడం లేదని, రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విషయాల్లో బకాయిపడ్డదని, ఆర్థిక మంత్రిగా ఉన్న భట్టి విక్రమార్కను ఇకనుంచి బకాయి విక్రమార్కగా పిలవాలని మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు ఎద్దేవా చేశారు. కాంట్రాక్టర్లకు వేలకోట్లు, కాలేజీలకు వందల కోట్లు బకాయిలుపడ్డారని ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రి మంచిర్యాలకు వచ్చిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే పీఎస్సార్‌ను ఆదర్శంగా తీసుకోవాలనడం విడ్డూరంగా ఉందన్నారు. అనేక అక్రమాలు, అరాచకాలు, బెదిరింపులు, దాడులకు పాల్పడుతున్న ఆయనను ఆదర్శంగా తీసుకోవాలా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో మంజూరైన పనులను తామే చేసినట్లు చెప్పకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.
బ్యాంకులతో చేసుకున్న ఒప్పందమే..
– మిర్యాల రాజిరెడ్డి
సింగరేణిలో టీబీజీకేఎస్ గుర్తింపు యూనియన్‌గా ఉన్న సమయంలో ఎస్సార్పీ-3లో జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతిచెందారని, వారికి ప్రమాద బీమా అమలు చేసినట్లు అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి తెలిపారు. బ్యాంకులతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా వారి కుటుంబాలకు రూ.40 లక్షల బీమా అందిందన్నారు. ఓసీ-2లో జరిగిన ప్రమాదంలో కార్మికుడు మృతి చెందితే రూ.కోటి పరిహారం ఇచ్చినట్లు, వాస్తవానికి ఈ ఒప్పందం బ్యాంకులతో సింగరేణి సంస్థ చేసుకున్నదని, దీనిని కాంగ్రెస్ మంత్రులు తామే ఇప్పించామని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. కాంట్రాక్టు కార్మికులకు రూ.5వేల బోనస్ కూడా టీబీజీకేఎస్ హయాంలో చేసుకున్నదేనని, అయితే ఇంప్లిమెంట్ మాత్రం ఈ ప్రభుత్వ హయాంలో అవుతుందన్నదన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 2016లో కార్మికుల పిల్లలు ఉద్యోగంలో చేరేందుకు 35 నుంచి 40 ఏండ్లకు పరిమితి పెంచారని, ఇవన్నీ మరిచి తామే చేసినట్లు ఆ నాయకులు చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ నాయకులు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, కొమురయ్య, పెట్టెం లక్ష్మణ్, బీఆర్ఎస్ నాయకులు నడిపెల్లి విజిత్‌రావు, గోగుల రవీందర్‌రెడ్డి, గాదె సత్యం పాల్గొన్నారు.