Naspur Municipality | మంచిర్యాల, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమైన నస్పూర్ బల్దియా అక్రమాలకు కేరాఫ్‌గా నిలిచింది. భవన నిర్మాణం మొదలు.. భారీ వెంచర్ల వరకూ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులివ్వడంవంటివి వివాదాస్పదం కాగా, తాజాగా సర్కారు అనుమతి లేకుండా 130 మంది పారిశుధ్య కార్మికులను నియమించి.. వారికి చట్ట విరుద్ధంగా పట్టణ ప్రగతి, 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి వేతనాలిచ్చిన వ్యవహారం వెలుగుచేసింది. ఈ అక్రమాలపై అనేక విమర్శలు వెల్లువెత్తుతుండా, ఉన్నతాధికారులు నోరుమెదపకపోవడం వెనుక ఆంతర్యమేమిటన్న ప్రశ్న తలెత్తుతున్నది.
అక్రమ నియామకాల లెక్కలివిగో..
2018, ఆగస్టు 2న సింగపూర్, నస్పూర్, తాళ్లపల్లి, తీగలపహాడ్ నాలుగు గ్రామ పంచాయతీలను కలుపుకొని నస్పూర్ మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు. అప్పటికే ఈ నాలుగు గ్రామ పంచాయతీల్లో 121 మంది కార్మికులు ఉన్నారు. క్రమేనా వారికి మరో 9 మందిని కలిపి మొత్తం కార్మికులను 130 మందిని చేశారు. కాకపోతే ఈ 9 మందికి ఎలాంటి మున్సిపల్ తీర్మానం గానీ, సీడీఎంఏ అప్రూపల్గాని తీసుకోలేదు. ఇదయ్యాక 2021 కరోనా సమయంలో 56 మంది, వారిని నియమించాక రెండు, మూడు నెలలు ఆగి మరో 20 మందిని ఇలా విడుతల వారీగా మొత్తంగా 86 మందిని కౌన్సిల్ తీర్మానంతో మూడు నెలల పని కోసం నియమించుకున్నారు.
కానీ, ఇప్పుడా మూడు నెలలు గడిచి.. నాలుగేళ్లవుతున్నా ఇప్పటికీ వాళ్లను నిబంధనలకు విరుద్ధంగానే కొనసాగిస్తున్నారు. నిబంధనల ప్రకారం మున్సిపాలిటీలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించాలంటే ముందు మున్సిపాలిటీలో ఫలానా పని కోసం, ఇంత మంది కార్మికులు అవసరం ఉన్నారని మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసి దాన్ని కలెక్టర్‌కు పంపాలి. కలెక్టర్ నుంచి సీడీఎంఏకు వెళ్తుంది. సీడీఎంఏ ప్రభుత్వ అనుమతి తీసుకొని కలెక్టర్‌కు, మున్సిపాలిటీకి పంపిస్తే ఆ అనుమతుల కాపీని బేస్ చేసుకొని మున్సిపల్ కౌన్సిల్లో దాన్ని ఆమోదించుకోవాలి. అది కూడా కొన్ని నెలల పాటు ఏ పనికోసమైతే తీసుకుంటారో, ఆ పని పూర్తయ్యే వరకు తాత్కాలికంగా తీసుకోడానికే వీలుంటుంది.
కానీ ఈ విధివిధానాలు ఏవీ పాటించకుండా నస్పూర్ మున్సిపల్ కమిషనర్లు 86 మందిని ఎవరికి నచ్చినట్లు వారు నియమించారు. 2024లో మరో 35 మందిని సైతం మున్సిపల్ తీర్మానం చేసి నియమించారు. నస్పూర్ మున్సిపాలిటీ ఏర్పాటైనప్పుడు 9 మంది, 2021 నుంచి ఇప్పటి దాకా 121 మంది మొత్తం కలిపి 130 మంది కార్మికులను అక్రమంగా, ఎలాంటి అనుమతులు, ప్రభుత్వ ఆదేశాలు లేకుండా నియమించారు. చట్టవిరుద్ధంగానే వేతనాల చెల్లింపు..ఇక గవర్నమెంట్ ఆర్డర్ లేకుండా నియమించిన వీరికి చట్టవిరుద్ధంగా జీతభత్యాలు చెల్లించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా మున్సిపాలిటీకి వచ్చే పన్నులు, జనరల్ ఫండ్ నుంచి ఔట్సోరింగ్స్, కాంట్రాక్ట్ సిబ్బందికి వేతనాలు ఇవ్వాలి.
కానీ, నస్పూర్‌లో మాత్రం పట్టణ ప్రగతి నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి వేతనాలు ఇచ్చారని, ఇది పూర్తిగా చట్ట విరద్ధమని మున్సిపల్ అధికారులే చెబుతున్నారు. ఇలా ప్రభుత్వ అనుమతి లేకుండా నియమితులైన ఉద్యోగులకు వేతనాలు సైతం సరిగా రావడం లేదు. 121 కార్మికుల్లో 2021లో నియమితులైన 86 మందికి డిసెంబర్ నెల దాకా వేతనాలు వచ్చాయి. జనవరి నెల వేతనం ఇంకా చెల్లించనే లేదు. 2024 నుంచి 2025 వరకు నియమితులైన 35 మంది కార్మికులకు సంబంధించిన వేతనాలు ఏడాది కాలంగా పెండింగ్‌లోనే ఉన్నాయి. జీతాలు లేక కుటుంబాలను పోషించుకోవడం ఇబ్బంది అవుతుందంటూ కార్మికులు వాపోతున్నారు.
ఈ సిబ్బంది ఈఎస్ఐ, ఈపీఎఫ్ సౌకర్యం లేదు. మున్సిపాలిటీలో పనులకు కార్మికుల అవసరం ఉంటే చట్టప్రకారం, ప్రభుత్వ అనుమతితో నియామకాలు చేపట్టాలి. కానీ నస్పూర్ మున్సిపల్ కమిషనర్లు, కౌన్సిలర్లు ఇవేవి పాటించకుండా ఇష్టారీతిన నియామకాలు చేయడంతో పని చేస్తున్న కార్మికులు అవస్థలు పడాల్సి వస్తున్నది. ఇప్పటికైనా కలెక్టర్ ఈ విషయంపై దృష్టి సారించి నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ని రోజులు నస్పూర్ మున్సిపాలిటీనే నమ్ముకొని పని చేసిన కార్మికులు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో విలీన అనంతరం ఇబ్బందులు పడకుండా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా చట్టబద్ధత కల్పించాల్సి ఉంది. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.