రైతులకు వ్యవసాయ రంగంలో సలహాలు, సూచనలు, శిక్షణ, ఇతర సమాచారం అందించడం, అవగాహన కల్పించేందుకు రైతువేదికలను తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది. వాటి నిర్వహణకు ప్రతి నెలా నిధులు విడుదల చేసి రైతుల సమావేశాలకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి నిర్వహణ గాలికొదిలేసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలు చోట్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో పాటు రైతు వేదికల్లోని పరికరాలు, సామగ్రి, ఫర్నిచర్ చోరీకి గురవుతుండడంపై రైతులు మండిపడుతున్నారు.
బెల్లంపల్లి మండల పరిధిలో కన్నాల జాతీయ రహదారి పక్కన, తాళ్లగురిజాల గ్రామంలో రైతు వేదికలను నిర్మించారు. వీటికి సెక్యూరిటీగా వాచ్మెన్లు, నిర్వహణకు అటెండర్లను నియమించాల్సి ఉన్నా ఇప్పటి వరకు నియామక ప్రక్రియ చేపట్టడం లేదు. దీంతో రైతు వేదికల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గురిజాల రైతు వేదికలో ఈ నెల 3న రాత్రి తాళం పగులకొట్టి అందులో ఉన్న వీడియో కాన్ఫరెన్స్ పరికరాలు, సౌండ్ బాక్సులు మొత్తం మూడు లక్షల విలువజేసే వస్తువులను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు.
మరుసటి రోజు బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలుద్దీన్, తాళ్లగురిజాల ఎస్ఐ చుంచు రమేశ్, జిల్లా వ్యవసాయాధికారి కల్పన, డీఏ రాజానరేందర్, మండల వ్యవసాయాధికారి సుద్దాల ప్రేమ్‌కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చోరీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎత్తుకెళ్లిన సామగ్రిని దుండగులు తీసుకువచ్చి అదేరోజు రాత్రి రైతు వేదిక వద్ద వదిలివెళ్లారు. కన్నాల రైతు వేదిక జాతీయ రహదారికి ఆనుకొని ఉండడం, పక్కన బంగారు మైసమ్మ ఆలయం ఉండడంతో అసాంఘిక కార్యకలాపాలు, మందుబాబులకు అడ్డాగా మారి మద్యం సీసాలతో దర్శనమిస్తున్నది. రైతు వేదికల నిర్వహణకు నిధులు లేక విద్యుత్ బిల్లులు, ఇతర మరమ్మతులు చేయలేని పరిస్థితి నెలకొన్నదని వ్యవసాయాధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిధులు లేక ఏఈవోలపై భారం..
మందమర్రి మండలంలోని సండ్రోన్‌పల్లి, బొక్కలగుట్ట గ్రామాల్లో రైతు వేదికలు నిర్మించారు. ఇందులో వ్యవసాయ శాఖతో పాటు అనుబంధ విభాగాలు ఇతర శాఖలకు సంబంధించి అవసరమైన సమావేశాలు నిర్వహిస్తున్నారు. రైతు వేదిక నిర్వహణకు ప్రతి నెలా ఖర్చుల కింద రూ. 9 వేలు ఇవ్వాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని విద్యుత్ చార్జీలు, తాగునీరు, గదులు శుభ్రం చేయడం, స్టేషనరీ , జిరాక్స్ , శానిటరీ, చిన్న చిన్న మరమ్మతులు, రైతు శిక్షణకు వినియోగించారు. కాంగ్రెస్ సర్కారు వచ్చాక రైతు వేదికల నిర్వహణకు 2023 సంవత్సరం నుంచి నిధులు విడుదల చేయడం లేదు. దీంతో వీటిని నిర్వహణ భారం ఏఈవోలపై పడుతున్నది. తాత్కాలికంగా స్వీపర్లను నియమించినప్పటికీ వారికి వేతనాలు ఇవ్వకపోవడంతో వారు పని మానేశారు. దీంతో రైతు వేదికలు శుభ్రం చేసుకునే బాధ్యత కూడా చేపట్టక తప్పడం లేదని ఏఈవోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బిల్లుల కోసం ప్రతిపాదనలు పంపించాం
రైతు వేదికల నిర్వహణ నిధుల కోసం ప్రభుత్వ ఉన్నతాధికారులకు నివేదించాం. ప్రభుత్వం నిధులు మంజూరు చేయగానే రైతు వేదికల వారీగా నిధులు అందజేస్తాం. ఆలస్యం కావడంతో ఏఈవోలకు ఇబ్బంది తప్పడం లేదు. త్వరలోనే నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది.
– జీ. కల్పన, మంచిర్యాల జిల్లా వ్యవసాయాధికారి