Singareni | బెల్లంపల్లి, నవంబర్ 15 : బెల్లంపల్లి ఏరియా దవాఖానపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. సింగరేణి యాజమాన్యం పట్టించుకోకవపోడంతో కార్మికులు, వారి కుటుంబాలకు వైద్య సేవలు అందని ద్రాక్షగా మారుతున్నాయి. ఇప్పటికే వార్డులను కుదించిన అధికారులు.. దీని నిర్వహణను కూడా గాలికొదిలేయగా, నిత్యం విద్యుత్ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రెండు నెలల క్రితం క్యాజువాలిటీ విభాగంలో షార్ట్ సర్క్యూట్ జరగగా, తాజాగా గురువారం వైద్యుల విశ్రాంతి గదిలో మంటలు చెలరేగడం కలకలం రేపింది. దవాఖానపై యాజమాన్యం ఉదాసీన వైఖరితో కార్మికులు, వారి కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
బెల్లంపల్లి ఏరియా దవాఖానకు ఏ చిన్న రోగం, నొప్పితో వచ్చినా ఇక్కడి వైద్యులు వెంటనే బీ-జోన్, గోదావరిఖని ఏరియా దవాఖానాలకు రెఫర్ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో 250 పడకలతో ఉన్న ఈ దవాఖానలో కేవలం క్యాజువాలిటీ వార్డులతోనే సరిపెడుతున్నారంటే వైద్య సేవలు ఎలా అందుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. ప్రత్యేక వైద్యులు, ఇతర వైద్యులు కొరత ఉండడంతో కార్మికులు ఇక్కడికి రావడం లేదని తెలుస్తోంది. గైనకాలజిస్ట్, అనస్థేసియా, రేడియోలజిస్ట్, ఆర్థో సర్జన్, హెల్త్ అధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గైనకాలజిస్ట్ స్థానికంగా ఉన్నా పక్షం రోజుల నుంచి విధులకు హాజరు కావడం లేదు. ఎంబీబీఎస్ వైద్యులు 10 మంది ఉండాల్సి ఉండగా, ఆరుగురు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. స్టాఫ్ నర్సులు 25 మందికిగాను 16 మంది మాత్రమే ఉన్నారు. దీంతో కార్మికులకు వైద్య సేవలు అందడం లేదు. ఈ నేపథ్యంలో వార్డులు కూడా బోసిపోయి ఉంటున్నాయి.
బెల్లంపల్లి సింగరేణి ఏరియా దవాఖాన 1986లో ప్రారంభమైంది. దశాబ్ధాల కాలం నాటి భవనం కావడంతో శిథిలావస్థకు చేరుకున్నది. భవనం పై కప్పు పెచ్చులూడుతున్నాయి. కిటికీలు పాడైపోయాయి. భవనం స్లాబ్ నుంచి వర్షపు నీరు గోడల్లోకి వెళ్లి షార్ట్ సర్క్యూట్‌కు కారణమవుతున్నది. రెండు నెలల క్రితం క్యాజువాలిటీలో షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకుంది. వెంటనే వైద్యం పొందుతున్న రోగులను అక్కడి నుంచి తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. తాజాగా.. గురువారం (ఈ నెల 14న) వైద్యుల విశ్రాంతి గదిలో ఏసీ పరికరానికి షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చేలరేగాయి. సూపరింటెండెంట్ మధుకర్ అప్రమత్తమై మెయిన్ ఆఫ్ చేయడం, ఫైర్ ఇంజిన్‌కు సమాచారం అందించడంతో పెద్దగా ప్రమాదమేమీ జరగలేదు.
శిథిలావస్థ భవనానికి మరమ్మతులు చేయించడంలో సింగరేణి యాజమాన్యం మీనమేషాలు లెక్కిస్తోందని ఆరోపణలున్నాయి. కాలం చెల్లిన విద్యుత్ వైర్ల స్థానంలో నూతన వైరింగ్ అమర్చాల్సి ఉండగా, పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఏదైనా పెద్దప్రమాదం జరిగితేనే యాజమాన్యం స్పందిస్తుందా అని స్థానికులు మండి పడుతున్నారు. దవాఖానలో స్విచ్ బోర్డుల వద్ద ఎక్కడా చూసినా తెగిపోయినా, వేలాడిన విద్యుత్ వైర్లు కనిపిస్తాయని కార్మికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సింగరేణి ఏరియా దవాఖాన పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో దవాఖానను రక్షించాలని కోరుతూ నాయకులు ఈ ఏడాది ఆగస్టులో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ దవాఖానను సందర్శించారు. సీఎంవోను పిలిపించి దవాఖాన సమస్యలపై సమీక్ష కూడా నిర్వహించారు. సెప్టెంబర్ 30 లోగా దవాఖానకు పూర్వ వైభవం తీసుకువస్తానని హామీ ఇచ్చారు. కానీ, ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని పరిరక్షణ కమిటీ నాయకులు మండి పడుతున్నారు. కనీసం దవాఖాన వైపు కన్నెత్తి కూడా చూడడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సింగరేణికే తలమానికం అయిన బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రం నడిబొడ్డున ఉన్న దవాఖాననే పట్టించుకోకుండా ఉన్నా ఎమ్మెల్యే ఇంకేం అభివృద్ధి చేస్తారని కార్మికులు ప్రశ్నిస్తున్నారు.