మంచిర్యాల, మే 14(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించే సమయానికి అకాల వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది. కొనుగోలు కేంద్రాల్లో కుప్పలుగా పోసిన ధాన్యం బుధవారం తెల్లవారు జామున కురిసిన వర్షానికి తడిసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు చోట్ల వర్షపు నీరు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ముంచెత్తింది. పలుచోట్ల కుప్పలుగా పోసిన ధాన్యంతోపాటు తూకం వేసిన ధాన్యం తడిసింది. మంచిర్యాల, నిర్మల్ జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం తెల్లవారుజామును భారీ నుంచి మోస్తరు వర్షం కురిసింది.
మంచిర్యాల జిల్లా భీమారం మండలంలోని కొత్తపల్లి, మద్దికల్, ఆరెపల్లి, రెబ్బపల్లి, దాంపూర్ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. కోటపల్లి మండలంలోని పారుపల్లి సహా చెన్నూర్ రూరల్ మండలంలోని ఆస్నాద్, కిష్టంపేట, కొమ్మెరలో భారీ వర్షానికి రాసులుగా పోసిన ధాన్యం కుప్పల్లోకి నీరు వచ్చి చేరింది. మందమర్రి రూరల్ మండలంలోని సారంగపల్లి, పొన్నారం, వెంకటాపూర్ కొనుగోలు కేంద్రాల్లో స్వల్పంగా ధాన్యం తడిసింది.
కన్నెపల్లి మండల కేంద్రంతోపాటు మాడవెల్లి, మెట్పల్లి కొనుగోలు కేంద్రాలు వర్షానికి బురదమయంగా మారాయి. దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల్లోనూ మోస్తరు వర్షం కురిసి.. ధాన్యపు రాశులపైకి వర్షపు నీరు చేరింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంతోపాటు మస్కాపూర్, సుజ్జాపూఉర్, సత్తన్నపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను భారీ వర్షం ముంచెత్తింది.
దీంతో చాలా వరకు ధాన్యం తడిసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలు మండలాల్లో వర్షం కురియడంతో కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం, తూకం వేసి మిల్లులకు తరలించేందుకు సిద్ధం చేసిన ధాన్యం తడిసిందని రైతులు అందోళన చెందుతున్నారు. సమస్యల వలయంలో రైతులు ధాన్యం విక్రయించుకోవాల్సిన ధైన్యం నెలకొందంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, ఆలస్యం చేయకుండా తడిసిన ధాన్యాన్ని కూడా తూకం వేసి మిల్లులకు తరలించాలని వేడుకుంటున్నారు.
భీమారం, మే 14 : వడ్లు మ్యాచర్ వచ్చి, కాంటా వేసేందుకు సిద్ధమైన వడ్లు తడిసినయ్. సెంటర్లో పరదలు కూడా ఇవ్వలేదు. ప్రభుత్వం స్పందించి సెంటర్ లో పరదలు, సౌకర్యాలు ఏర్పాటు చేయాలే. అప్పులు చేసి ఆరుగాలం పండించిన పంట చేతికి రాకుండా పోతున్నది. తడిసిన వడ్లను చూస్తే దుఃఖం వస్తున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.
– సెగ్యం నాగరాజు, రైతు, భీమారం
భీమారం, మే 14 : గతంలో పరదలు సెంటర్ నిర్వాహకులు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఇస్తలేరు. వానలతో మాకు బాధ అయితున్నది. పరదలు లేక వడ్లన్నీ తడిసినయ్. రెండు ఎకరాల పొలం కోసి ఇక్కడికి తెస్తే లాభం లేకుండా అయింది. తెల్లవారు జామున వచ్చి పరదలు కప్పిన. ఇంకా ఐదు ఎకరాల పొలం కొయ్యలేదు. ఈ వానకు మొత్తం నేలవాలింది.
– కొమ్ము కొమురన్న యాదవ్, రైతు, భీమారం
జైపూర్, మే 14: ఐకేపీ సెంటర్కు 15 రోజుల కింద వడ్లు తీసుకువచ్చినా కాంటా వేయలేదు. హమాలీలు లేరని చెప్పిండ్రు. ఆరబోసిన వడ్లు చాలా వరకు వానకు కొట్టుకపోయినయి. టార్పాలిన్లు కూడా ఇవ్వలేదు. టైంకి వడ్లు కొంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పటికే 42 కిలోలకు 39 కిలోల చొప్పున లెక్క కడుతున్నారు. అధికారులు పట్టించుకొని కొట్టుకుపోయిన వడ్లకు డబ్బులు కట్టియ్యాలే.
– కొంతం చంద్రకళ, రైతు, రామారావుపేట,
మందమర్రిరూరల్, మే 14 : పంట అమ్ముకుని చేతికి డబ్బులు వచ్చే సమయంలో ఈ వాన మమ్మల్ని దెబ్బతీసింది. ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లను కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తే వానకు మొత్తం తడిసినయ్. తడిసిన ధాన్యాన్ని గవర్నమెంట్ వెంటనే కొనాలే. ఆలస్యం చేయకుండా కొంటే కష్టాల నుంచి గట్టెక్కుతాం.
– జంగపెల్లి లింగయ్య, రైతు, సారంగపల్లి