బజార్ హత్నూర్ : తెలంగాణ ప్రభుత్వం ( Government) పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటీసీ మల్లెపూల నరసయ్య ,మండల అధ్యక్షులు జెల్కె పాండురంగ్ తెలిపారు. మండల కేంద్రంలో వారు సన్న బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా దేశ చరిత్రలోనే మొదటిసారి రేషన్ కార్డు ( Ration Card ) కలిగిన ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ( Rice) పంపిణీ చేపట్టి చరిత్రలో నిలిచిపోయిందని తెలిపారు.
ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని యావత్ తెలంగాణ ప్రజలు హర్షిస్తున్నారని అన్నారు. ఆనాడు సోనియా గాంధీ ( Sonia Gandhi) ఆహార భద్రత చట్టం తీసుకువచ్చి ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేశారని, నేడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే బాటలో సన్న బియ్యం పంపిణీ చేసి ప్రజల మనన్నలను పొందుతుందని అన్నారు. బీజేపీ నాయకులు ( BJP Leaders ) దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేసే విధంగా ప్రధానమంత్రి మోదీని కోరాలని డిమాండ్ చేశారు.
సమీప భవిష్యత్తులో తొమ్మిది రకాల నిత్యావసర సరుకులను కూడా ప్రజా పంపిణీ వ్యవస్థలో రేషన్ డీలర్ల ద్వారా అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకోబోతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ హీరాలాల్, ఆర్ఐ నూర్ సింగ్, కాంగ్రెస్ నాయకులు బత్తిని కిషన్, అరె పాండురంగ్, కళ్లెం విటల్, మాజీ ఎంపీటీసీ తిరుమల, రేషన్ డీలర్ బిట్లింగ్ లక్ష్మణ్ స్వామి, నాయకులు పాల్గొన్నారు.